ఏడాది తిరక్కుండానే ఇదేంటి జగన్?

August 05, 2020

జగన్ సర్కారు ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టి ఏడాది కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే ఎన్నో వివాదాలు... విమర్శలు.. ఆరోపణలు. అలాగని ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం కరెక్ట్ కాదు. అలాగని అన్ని విమర్శలు, ఆరోపణలనూ కొట్టి పారేయలేం. ఏపీ నుంచి ఉన్న పరిశ్రమలు వెళ్లిపోగా, కొత్తవేవీ రావట్లేదన్న ఆరోపణల్లో నిజముంది.

ప్రభుత్వ ఆదాయం అంతకంతకూ పడిపోతూ వస్తోంది. ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలేవీ జరగట్లేదు. అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏడాది తిరక్కుండానే 80 వేల కోట్ల అప్పు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖజానాకు ఎంత కటకట ఏర్పడినా.. ఓటు బ్యాంకును నిలబెట్టే పథకాల్ని మాత్రం జగన్ విస్మరించట్లేదు. వాటికి లోటు రాకుండా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదాయం కోసం రకరకాల మార్గాల్ని అన్వేషిస్తోంది జగన్ సర్కారు.

పెట్రోలుపై పన్నులు బాదడం.. మద్యం ధరలను విపరీతంగా పెంచడం.. కరెంటు బిల్లుల రీడింగ్ రెండు నెలలకు తీసి స్లాబ్‌ల మార్పుతో బిల్లు విపరీతంగా పెంచి వసూలు చేయడం లాంటివి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు జగన్ సర్కారు ప్రభుత్వ భూములపై పడింది.

రాష్ట్ర వ్యాప్తంగా భూముల అమ్మకాలకు తెర లేపింది. ముందుగా కాబోయే రాజధాని విశాఖపట్నంతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలపై దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఖరీదైన భూములున్నాయో గుర్తించింది. వాటిని వేలం వేయడానికి రంగం సిద్ధం చేసింది. వేలానికి ఉంచిన భూములన్నీ పదులు, వందల కోట్ల ఖరీదైనవే.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ భూములు తగ్గిపోయాయని.. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, ప్రాజెక్టులకు భూమి లేదని అంటుంటే.. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదికే భూముల వేలానికి దిగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు మూడేళ్ల వరకు కూడా ఆగకుండా ఇంత త్వరగా భూముల వేలానికి దిగడం ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.