జగన్ మార్క్ దెబ్బ... ఉద్యోగులు అబ్బా అనాల్సిందే

January 25, 2020

నిజమే... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సమీక్షల కోసం తన ఇంటికి పిలిపించుకున్న ఉద్యోగులకు తన ఇంటిలో వండిన భోజనాన్నే పెట్టారు. గుర్తుంది కదా. రండి అన్నా అంటూ జగన్ పిలిచిన పిలుపునకు ఉద్యోగులు ఫిదా అయిపోయారు. ఈ వార్తలు చూసిన కింది స్థాయి సిబ్బంది ఆనంద డోలికల్లో తేలియాడారు. పై స్థాయి అధికారులనే ఆ రకంగా చూసుకుంటే... చాలీచాలని వేతనాలు తీసుకుంటున్న తమను జగన్ ఇంకెలా చూసుకుంటారోనంటూ సంబరపడిపోయారు. అయితే ఆ సంబరం జగన్ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు అడ్రెస్ లేకుండా గాల్లో కలిసిపోయింది. అన్నొచ్చాడనుకుంటే... ఇలాగైందేమిటబ్బా అంటూ ఇప్పుడు ఏపీలోని అన్ని స్థాయి ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారట.

అయినా ఏం జరిగిందని ఉద్యోగులు తలలు పట్టుకున్నారన్న వివరాల్లోకి వెళితే...  జగన్ సర్కారు గురువారం ఉద్యోగ వర్గాలకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీలు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్‌వోడీలు, కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల సిబ్బంది మొత్తాన్ని ఒకే దెబ్బకు బదిలీ చేసేయాలని నిర్ణయం తీసుకుంది. క్లాస్‌ వన్‌ నుంచి క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగి వరకు పేషీల్లో ఉన్నవారందరినీ బదిలీ చేయాలని పేర్కొంది. డిసెంబరు 31వ తేదీలోగా ఈ మార్పుల చేర్పులు జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్వర్వుల ప్రకారం ఆయా  కార్యాలయాల్లో మూడేళ్లకు మించి పని చేస్తున్న వారందరికీ వర్తిస్తుందట. 

అంతేకాకుండా ఈ బదిలీలను ఆపడం ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదని, అలా ఆపే అధికారం ఒక్క సీఎం పేషీకి మాత్రమే ఉందని కూడా సహానీ తేల్చేశారు. మొత్తంగా ఒకే ఒక్క దెబ్బకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందిని ఉన్నపళంగా బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసేశారు. అంతేకాకుండా ఈ బదిలీలన్నీ కూడా ఈ నెలాఖరు నాటికే పూర్తి అవుతాయని కూడా సహానీ తన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. అంటే... ఉద్యోగులకు కనీసం ఆలోచించుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండానే జగన్ సర్కారు... ఉద్యోగులపై బదిలీ వేటు వేస్తోందన్న మాట. మరి తనదైన మార్కుతో బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్న జగన్ ను ఉద్యోగులు ఎలా నిలువరిస్తారో చూడాలి.