​జేసీ దివాకర్ రెడ్డిపై జగన్ భారీ దెబ్బ

May 24, 2020

తనకు నచ్చకపోతే నాన్న చేసిన పనినే రద్దు చేసే జగన్... నాన్న ఇచ్చిందని శత్రువుని వదిలేస్తాడా? ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోతుంటే దృష్టిపెట్టని ముఖ్యమంత్రి కార్యాలయం... ముఖ్యమంత్రికి నచ్చని వారిపై టార్గెట్ చేస్తూ పనిచేస్తోంది. తాజాగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
అనంతపురం జిల్లా యాడికి పరిధిలో జేసీ దివాకర్ రెడ్డికి 2007లో ప్రభుత్వం కేటాయించిన సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేసింది. యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బి పరిధిలోని 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులను గతంలో త్రిశూల్ కంపెనీకి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇది జేసీ దివాకర్ రెడ్డికి చెందిన కంపెనీ. సిమెంట్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే వాటిని రద్దు చేసినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. టెక్నికల్ గా ప్రభుత్వం చేసిన పనిలో ఎలాంటి తప్పిదం లేకున్నా కూడా... ఇది పర్సనల్ లెవెల్లో తీర్చుకున్నరాజకీయ నిర్ణయం అని,  రివెంజ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007 ఆగస్ట్ 1న ఈ గనులు త్రిశూల్ కంపెనీకి కేటాయించారు. ఈ సిమెంట్ రాయి నిక్షేపాలు వాడుకోవడానికి 20 సంవత్సరాలు లీజు ఇచ్చారు. అది 2027 జూలై 31తో ముగుస్తుంది. అయితే... 2009లోపు కంపెనీ పెడితేనే ఈ లీజు చెల్లుబాటు అవుతుంది. అయితే, గడువులోపు  త్రిశూల్ కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించలేకపోయింది. దీంతో తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కంపెనీని ఏర్పాటు చేసేందుకు మరో ఐదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. 2015 జూలై 31 నాటికి కంపెనీ నిర్మించాలి. ఈ గడువు అయిపోయేటప్పటికి టీడీపీ అధికారంలో ఉంది. అప్పటికి జేసీ కూడా టీడీపీలో ఉన్నారు. దీంతో మరోసారి ఐదేళ్లు అంటే 2020 జూలై 31 నాటికి పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. కొన్ని నెలలు ఇంకా గడువు ఉండగానే జగన్ ప్రభుత్వం లీజును రద్దు చేసేసింది. లీజు ప్రకారం గనుల శాఖకు చెల్లించాల్సిన బకాయిలు రూ.38,03,376 ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దాంతో పాటు అనుమతి లేకుండా 38,212 మెట్రిక్ టన్నుల సిమెంట్ రాయిని అక్రమంగా తవ్వి తరలించినందుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మరి దీనిపై జేసీ దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ​