డల్లాస్ వేదికపై జగన్ హైలైట్స్

August 07, 2020

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వారం పాటు సాగే టూర్ లో రెండో రోజున ఆయన డల్లాస్ వేదిక మీద ప్రవాసాంధ్రులను ఉద్దేశించి కీలక ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా తన కల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. ఐ హ్యావ్ ఏ డ్రీం.. అంటూ తన కలను విప్పిన జగన్.. అవినీతి.. లంచగొండితనం లేకుండా రాష్ట్రాన్ని చేయాలన్నదే తన స్వప్నంగా పేర్కొన్నారు. నాన్నను.. తనను.. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వారందరికి ప్రేమాభివందనాలు చెప్పిన జగన్.. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్ ఆర్ ఐలు కీలకభూమిక పోషించినట్లుగా చెప్పారు. తన చారిత్రక విజయం వెనుక ప్రవాసాంధ్రుల కృషి ఎంతో ఉందన్నారు.
అమెరికన్లను మించి తెలుగువారు.. భారతీయులు ఎదుగుతున్న తీరు తనకు గర్వకారణంగా ఉందన్న జగన్.. అమెరికా అభివృద్ధి వెనుక తెలుగువారు ఉన్నారన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా చెప్పారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నట్లుగా చెప్పిన జగన్.. ఆర్థికంగా.. సామాజికంగా.. రాజకీయంగా ప్రతి మనిషి.. ప్రతి కుటుంబం.. ప్రతి సామాజిక వర్గ గౌరవాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన తనకు కొన్ని లక్ష్యాలు ఉన్నట్లు చెప్పారు. అన్నం పెట్టే రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి రాకూడదన్నారు.
ఏపీలో నిరక్షరాస్యత ఉండకూడదని.. పల్లెలు కళకళలాడాలని.. ప్రభుత్వ పాఠశాల్ల్లో మంచి చదువులు ఉండాలని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సొంతిల్లు లేనోళ్లు రాష్ట్రంలో ఉండకూడదని.. మద్యం కారణంగా ఏ కుటుంబ విచ్చిన్నం కాకూడదన్నారు. ఏ ఒక్కరు నిరుద్యోగం కారణంగా పస్తులు ఉండకూడదన్నదే తన లక్ష్యమన్నారు. పేదరికం కారణంగా ఏ తెల్లి తన పిల్లాడ్ని చదవించలేని దుస్థితి ఉండకూడదన్నారు. కులాలు.. మతాలు.. ప్రాంతాలు.. రాజకీయాలకు తావు లేకుండా విపక్షలేని పాలన అందించాలన్నదే తన కోరికగా చెప్పారు.
రెండున్నర నెలల స్వల్ప వ్యవధిలోనే పాలనా పరంగా మార్పులు తెచ్చామని.. అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులు తీసుకొచ్చినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో నామినేటెడ్ పదవులు.. పనుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో మరెక్కడా లేని రీతిలో రూల్ తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సఖ్యత కుదుర్చుకున్నట్లు చెప్పారు. మొత్తానికి స్వల్ప వ్యవధిలో పాలనా పరమైన మార్పులు తేవటంతో పాటు.. అందరికి కలిసిమెలిసి పాలన సాగిస్తున్న విషయాన్ని జగన్ చెప్పారు.