ముందు చూపుతో జగన్ వేసిన ప్లాన్ అది

June 02, 2020

జగన కు రాజకీయానుభవం లేదు అని చంద్రబాబు అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న అనుభవం మాత్రం జగన్ గట్టిగా సంపాదించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీద, అధికారంలో ఉన్న వ్యక్తి మీద చరిత్ర సృష్టించేంత పెద్ద మెజారిటీతో గెలిచిన జగన్.. ఎన్నికల వ్యూహాల్లో తానెంత ముందు చూపుతో ఉన్నది ప్రపంచానికి చాటాడు. ఈవీఎలు ట్యాంపర్ చేశారా? లేదా ప్రజల మెదళ్లను ట్యాంపర్ చేశారా? అన్న వాదన పక్కన పెడితే... తాను ఎలా గెలవాలి అనే విద్య మాత్రం జగన్ కు బాగా వచ్చనే విషయం తేలిపోయింది.

తాజాగా పంచాయతీ ఎన్నికల దగ్గరపడ్డాక వాటి గురించి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల అయిన మరుక్షణం ఈ పంచాయతీ ఎన్నికలకు అపుడే స్కెచ్ వేసుకున్నారు. ప్రతి ప్రభుత్వ రూపాయితో తన పార్టీకి ఎలా లాభం చేకూరాలి, ఏ రూపాయి ఎలా ఖర్చుపెడితే తన పార్టీకి లాభం అనే కోణంలో మాత్రమే జగన్ ఆలోచిస్తుంటారు. ఫలితం గురించి తప్ప... న్యాయాన్యాయల గురించి, ధర్మాధర్మాల గురించి ఆలోచిస్తూ జగన్ సమయం వృథా చేయరు. 

పంచాయతీ ఎన్నికలు గెలవడానికి జగన్ రచించిన వ్యూహమే పేదలకు ఇళ్ల స్థలం. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి ఒక్కరిలో సొంత ఇంటి స్థలం ఆశ చూపి కుటుంబాల ఓట్లే నొక్కేయాలని పక్కగా ప్లాన్ వేశారు. అందుకే కొన్ని నెలల క్రితమే దీనికి ప్లాన్ చేశారు. ప్రతి పథకమూ ఏపీ అభివృద్ధి కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం రూపొందించారు. కానీ పేదలకు భూముల భ్రమ చూపి ఓట్లు అడ్డంగా కొట్టేయొచ్చన్న వ్యూహాత్మక తెలివి మాత్రం వైసీపీ అధినేత జగన్ దే అయి ఉంటుంది. 

ఇదొక్కటే కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికలపై దృష్టిపెట్టి అమ్మఒడిని, రైతు పెట్టుబడిని, ఉచిత భూపంపిణీని అందుకు వాడుకున్నారు జగన్ రెడ్డి. ఎన్నికలు గెలవడంలో జగన్ ది చిన్న బుర్ర కాదు.