జ‌గ‌న్ వెర్స‌స్ డాక్ట‌ర్స్‌

August 08, 2020

ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకూ విజృంభిస్తున్న వేళ‌.. ఈ క‌ష్ట కాలంలో అత్యంత కీల‌క పాత్ర పోషించాల్సిన వైద్యుల ప‌ట్ల‌ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. క‌రోనా పేషెంట్ల‌కు, అనుమానితుల‌కు చికిత్స అందించాల్సిన, ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన వైద్య సిబ్బందిని ప్రభుత్వం సుర‌క్షిత స్థితిలో ఉంచ‌ట్లేద‌న్న‌ది ప్ర‌స్తుతం ప్ర‌ధానంగా వినిపిస్తున్న ఆరోప‌ణ‌. అందుకు ఉదాహ‌ర‌ణ‌లు చాలానే క‌నిపిస్తున్నాయి.

ప‌లువురు వైద్యులు త‌మ‌కు మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు ఇవ్వ‌ట్లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ స్వ‌చ్ఛందంగా వీడియోలు పెడుతున్నారు. కొన్ని ఫొటోల్లో వైద్యులు మాస్కులు లేకుండానే క‌నిపిస్తుండ‌గా.. రాజ‌కీయ నాయ‌కులు మాత్రం సుర‌క్షిత‌మైన ఎన్-95 మాస్కులతో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైద్య శాల‌ల‌కు వెళ్లాల్సిన ఎన్-95 మాస్కులు, ఇత‌ర సామ‌గ్రిని వీఐపీల కోసం త‌ర‌లించిన‌ట్లు నేష‌న‌ల్ మీడియాలోనూ వార్త‌లొచ్చాయి.

ఇదిలా ఉండ‌గా.. త‌మ‌కు ఆసుప‌త్రుల్లో మాస్కులు అందుబాటులో లేని నేప‌థ్యంలో వాటి కొనుగోలు కోసం విరాళాలు ఇవ్వాలంటూ జూనియ‌ర్ డాక్ట‌ర్ల  సంఘం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇంకోవైపు న‌ర్సీప‌ట్నంలోని ఆసుప‌త్రికి చెందిన ఓ వైద్యుడు మాస్కుల కొర‌త‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై మీడియా ముందు విమ‌ర్శ‌లు చేస్తే.. ఆయ‌న దురుద్దేశంతో ఇలా మాట్లాడాడని, తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రుడ‌ని చెబుతూ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఈ ప‌రిణామాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందిలో ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక ధోర‌ణి క‌నిపిస్తోంది.

తాజా స‌స్పెన్ష‌న్ నిర్ణ‌యంతో ఇక ఎవ్వ‌రూ నోరు తెర‌వలేని ప‌రిస్థితి వ‌చ్చింది కానీ.. లోలోన వైద్య సిబ్బంది జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం, అస‌హ‌నంతో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఓవైపు తెలంగాణ‌లో వైద్య సిబ్బంది గురించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప‌గా మాట్లాడుతూ.. వారికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. ఏపీలో మాత్రం దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోందంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.