ఎన్నికలకు అమరావతి గ్రామాలు దూరం.. అనుమానాలెన్నో?

June 06, 2020

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మార్చి 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ,23న మున్సిపల్, 27, 29 తేదీల్లో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్స్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఐతే వైసీపీ ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ ఎన్నికల కమిషన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది లేఖ రాశారు. ఆ లేఖలో ఎన్నికలు నిర్వహించని గ్రామపంచాయతీల వివరాల్ని జిల్లాల వారీగా ప్రస్తావించారు. 

ఈ జాబితాలో రాజధాని అమరావతి పరిధిలోని పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కోర్టు కేసులు, ఇతర కారణాల పేరుతో ఇక్కడ ఎన్నికలు నిలిపివేయాలని కోరారు. ఐతే అసలు విషయం వేరే ఉందనేది స్థానికులు, ప్రతిపక్ష పార్టీల వాదన. మూడు రాజధానుల దిశగా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోన్న నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అమరావతి ఉద్యమం జోరుగా సాగుతోంది.

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని భావించి ఉంటారని, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో వ్యతిరేకత లేదని, కేవలం టీడీపీ సృష్టి అని వైసీపీ చెబుతోంది. కానీ ఎన్నికలు జరిగి, వైసీపీకి ఎదురుదెబ్బ తగిలితే టీడీపీ మాట వాస్తవం అవుతుంది. అమరావతి ఉద్యమం నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భయంతో ఎన్నికల నిర్వహణకు వైసీపీ జంకుతోందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.

ఇక్కడ మరో కీలక అంశం గుర్తించాల్సి ఉంది. రాజధాని అంటే కేవలం ఆ ప్రాంతంలోని వారికే ప్రయోజనంగా భావించాల్సిన అవసరం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఆ చుట్టు పక్కల జిల్లాలపై కూడా ప్రభావం ఉంటుంది. అమరావతిలో వ్యతిరేకతే నిజమైతే ఆ రెండు జిల్లాల వ్యాప్తంగా కూడా రాజధాని ఉద్యమ ప్రభావం ఉండాలి. కానీ కేవలం రాజధాని ప్రాంతంలోనే ఎన్నికలు నిలిపివేసి, మిగతా అన్నిచోట్ల సిద్ధమంటున్నారు.

ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై కేవలం రాజధాని ప్రాంతంలోనే వ్యతిరేకత ఉందా? కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ఆ ప్రభావం లేదా? సొంత పార్టీ ఎమ్మెల్యేల బలంపై ఆశలు పెట్టుకున్నారా? వీటన్నింటిని పక్కన పెడితే సాధారణంగా ఎన్నికలకు ముందు ఎవరైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు.

ఇందుకు జగన్ కూడా మినహాయింపు కాదని చెప్పవచ్చు. అమరావతి ఉద్యమం వంటి ప్రత్యేక సమయాల్లో తప్పనిసరిగా తమ పార్టీ పరిస్థితి గురించి తప్పకుండా తెప్పించుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పుగా అందిందా? వీటికి సమాధానం.. ఎన్నికల తర్వాతే తెలియనుంది. రెండు జిల్లాల్లోను వైసీపీకి ఫలితాలు వైసీపికి వ్యతిరేకంగా వస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు రావడంతో పాటు రాజధాని ఉద్యమాన్ని జగన్ తక్కువగా అంచనా వేయవద్దనే హెచ్చరికలు వెళ్తాయి. గెలిస్తే మాత్రం ఊరట.

ఇక, రాజధాని ప్రాంతంలో ఎన్నికల నిలుపుదలపై వివిధ కారణాలు చూపిస్తున్నారు. హైకోర్టులో ఉన్న కేసులు, పిటిషన్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ఎన్నికలు వాయిదా వేయాలని చెబుతోంది. అలాగే రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పోరేషన్‌గా గుర్తించడంతో పాటు ఇతర మున్సిపాలిటీలను విలీనం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపేందుకు కసరత్తు చేస్తోంది. నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను అమరావతి కార్పోరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. 

కొసమెరుపు : రాజధాని తరలింపు కృష్ణా, గుంటూరు జిల్లాలోని ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతో కొంత నష్టం కలిగింది. ఈ రెండు జిల్లాలో జగన్ కి 20 శాతం సీట్లు వచ్చినా... దానికి కారణం ఏదైనా ఆ రెండు జిల్లాల ప్రజలు ఏపీ భవిష్యత్తును నాశనం చేసిన వారుగా ఏపీ చరిత్రలో మిగిలిపోతారు.