జనమంతా మునిగినా... బాబు మీదే జగన్ ధ్యాస

February 22, 2020

ఏపీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తిన వరదలు.. నిన్నటికి నిన్న కర్నూలు, కడప జిల్లాలను అతలాకుతలం చేశాయి. ఈ వరదలు... ఏదో ప్రకృతి విపత్తుగా కాకుండా మ్యాన్ మేడ్ వరదలుగానే ప్రచారం సాగింది. వర్షాలు, అది కూడా భారీ వర్షాలు కురుస్తున్నప్పడు... ప్రత్యేకించి నదులకు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పుడు లోతట్టు ప్రాంతాలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. అందుకు భిన్నంగా కదిలిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారు మాత్రం వరదలను క్రియేట్ చేసి మరీ పలు ప్రాంతాలను ముంచేసిందన్న వాదనలు ఇప్పటికే కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి.

వరద నీరు, కీలక ప్రాజెక్టుల్లో నీటి నిర్వహణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ, యంత్రాంగం ఉన్నప్పటికీ జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే అలా సైలెంట్ గా కూర్చుండిపోయింది. వెరసి వేలాది కుటుంబాలు వరద బాధిత కుటుంబాలుగా మారిపోయాయి. అయినా కూడా జగన్ సర్కారుకు మత్తు వదలలేదన్న మాటే వినిపిస్తోంది. కేవలం తాను టార్గెట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను వరద నీటిలో ముంచేయాలన్న ఒకే ఒక్క లక్ష్యంతోనే కదిలిన జగన్ సర్కారు... వేలాది కుటుంబాలను వదర బాధితులుగా మార్చేసింది. 

ఈ తతంగం అంతా  కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తిన వరదల సందర్భంగా మనమంతా కళ్లారా చూశాం. తాజాగా ఇప్పుడు  కర్నూలు, కడప జిల్లాలను అతలాకుతలం చేసిన వరదల సమయంలోనూ జగన్ సర్కారు అదే వైఖరితోనే వ్యవహరించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా శనివారం కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్... అక్కడి బాధితులు, పరిస్థితులను ఉధ్దేశించి చేసిన వ్యాఖ్యలు... అదే సమయంలో ఇక్కడ చంద్రబాబు నివాసానికి జారీ చేసిన నోటీసులు నిలుస్తున్నాయని చెప్పక తప్పదు. వరదలు రావడం మంచిదేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను విన్న అధికార యంత్రాంగం నివ్వెరపోగా... జగన్ మాటలు తెలిసినంతనే బాధితులతో పాటు ఇతర ప్రాంతాల జనం షాక్ కు గురయ్యారని చెప్పక తప్పదు. వరద ప్రాంతాల్లో జగన్ పర్యటనకు బయలుదేరడానికి కొన్ని గంటల ముందుగా... అది కూడా రాత్రి పొద్దుపోయిన తర్వాత చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు అంటించిన వైనం చూస్తుంటే... నిజంగానే షాక్ తినక తప్పదు. 

ఎందుకంటే... ఇప్పటికే చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ ఓ దఫా నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసులకు స్పందించిన సదరు నివాసం యజమాని లింగమనేని రమేశ్ సమాధానం కూడా ఇచ్చారు. అయితే ఆ సమాధానం తమకు ఇఫ్పుడే అందిందన్న రీతిలో స్పందించిన జగన్ సర్కారు... జగన్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లడానికి కొన్ని గంటల ముందుగా అది కూడా శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మరోమారు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో లింగమనేని గెస్ట్ హౌస్ ను నిబంధనలకు విరుద్ధంగా కట్టారని, వారంలోగా సదరు భవనాన్ని కూల్చకపోతే... తామే కూల్చేస్తామని కూడా జగన్ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. ఓ వైపు ప్రభుత్వ ముందు చూపు లేని కారణంగా వేలాది కుటుంబాలకు వరదలకు అల్లాడుతుంటే... అదేదో సినిమాను చూసినట్టుగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు.. చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయించడమే లక్ష్యంగా కదులుతున్నట్లుగా అనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. జగనే ఓ టైపు అయితే... ఆయన పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరింతగా రెచ్చిపోయి చంద్రబాబు నివాసం అతిక్రమణలపై తనదైన శైలిలో చేస్తున్న వ్యాఖ్యలను వింటుంటే... ఈ ఐదేళ్లు కూడా ఈ తరహా విపరిణామాలకు సిద్ధం కాక తప్పదన్న భావనకు జనం రాక తప్పదన్న వాదన వినిపిస్తోంది.