ఏపీలో తమిళనాడు రాజకీయం డిసైడ్ చేసిన జగన్

February 28, 2020

రాజకీయాలన్నాక సవాలచ్చ యవ్వారాలు ఉంటాయి. రాజకీయం రాజకీయమే.. వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగతమే. ఏ రాజకీయ నాయకుడైనా.. పార్టీ అధినేత అయినా రాజకీయ పరిధిని దాటి.. విబేధాల్ని వ్యక్తిగత స్థాయిలోకి తీసుకెళితే జరిగే నష్టం గురించి అప్రమత్తతతో ఉంటారు. ఫ్యాక్షనిస్టులకు ఎలా అయితే.. ఆడోళ్లు.. పిల్లల జోలికి వెళ్లకూడదని.. ఎంత శత్రువైనా సరే.. తమ ప్రత్యర్థుల్ని హతమార్చటమే కానీ.. కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని భావించరు. ష్యాక్షన్ నీతి మాదిరే రాజకీయాల్లోనూ.. విషయాల్ని వ్యక్తిగత స్థాయిలోకి తీసుకెళ్లకూడదన్న అప్రకటిత నిబంధనను ఫాలో అవుతారు.
అయితే.. ఇలాంటి వాటిని మధ్య మధ్యలో బ్రేక్ చేసే నేతలు కొద్దిమంది ఉంటారు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగతంగా ఆపాదించి.. విషయాన్ని మరింత ముదిరేలా చేసే తీరు తమిళనాడు రాజకీయాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దివంగత.. కరుణ.. జయలలితల మధ్య రాజకీయ వైరం ఎలాంటి పరిస్థితుల్ని తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లక్కీగా ఈ తరహా రాజకీయాలు తెలుగు నేల మీద కనిపించవు.
రాజకీయంగా ఎంత కిందామీదా పడినా వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి మినహాయింపుల్ని వర్తించేలా అధినేతలు జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే.. ఈ లక్ష్మణ రేఖను తాజాగా అదే పనిగా దాటేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను తాను పవర్లోకి వచ్చిన తొలినాళ్లలోనే విజయవంతంగా కూల్చేసిన ఆయన.. తాజాగా బాబు అద్దెకు ఉండే నివాసాన్ని కూల్చేసే విషయంలోనూ పట్టువీడలేదు.
రాజకీయాల్ని వ్యక్తిగత స్థాయికి దిగజార్చేలా జగన్ తన నిర్ణయాల్ని అమలు చేస్తున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా..  ప్రతి నాయకుడు ఏదో ఒక తప్పు చేస్తుంటారు. దీనికి జగన్మోహన్ రెడ్డి సైతం మినహాయింపు కాదు. అధికారం చేతిలో ఉంది కదా అని.. ఇష్టారాజ్యంగా దాన్నివాడేస్తే.. భవిష్యత్తులో దాని విపరిణామాల్ని చవిచూడాల్సి వస్తుందన్న చేదు నిజాన్ని మర్చిపోకూడదు. తెలుగు నేల మీద ఇప్పుడు కనిపించే చాలా రాజకీయాలకు నాంది చంద్రబాబే. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆయన.. ఇప్పుడు ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జగన్మోహన్ రెడ్డి అయినా సరే దీనికి అతీతుడు కాదన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఫార్టీ ప్లస్ లో ఉన్న జగన్ కు రాజకీయ భవిష్యత్తు చాలానే ఉంది. సుదీర్ఘకాలం సాగే అవకాశం ఉన్న వేళ.. రాజకీయ వైరంలో ఎంతకైనా వెళ్లే తీరు ఆయనకు ప్రతికూలంగా మారటమే కాదు.. రానున్న రోజుల్లో ఆయనకు ఈ తరహా గడ్డు పరిస్థితులు మరిన్ని ఎదురయ్యే అవకాశాన్ని మర్చిపోలేం.
రాజకీయ అంశాల కారణంగానే తన మీద కేసులు పెట్టి.. జైలుకు వెళ్లేలా చేశారంటూ అప్పట్లో కాంగ్రెస్ అధినాయకత్వంపై ఆగ్రహాన్ని.. ఆవేదనను వ్యక్తం చేసిన జగన్.. ఈ రోజున తన చేతికి పవర్ రాగానే చేస్తున్నదేమిటి? అన్నది ప్రశ్న. ఒకప్పుడు రాజకీయ అధికారానికి బాధితుడిగా మారిన వైనంతో తన ఇంటి సభ్యులు రాజ్ భవన్ కు సమీపంలోని పుట్ పాత్ మీద నిరసన చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని జగన్ మర్చిపోయారా? అన్నది ప్రశ్న.
రాజకీయ ప్రత్యర్థుల విషయంలో చూసిచూడనట్లుగా ఉండాలని చెప్పట్లేదు కానీ.. వైరాన్ని వ్యక్తిగత స్థాయికి దిగజార్చకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతీకార రాజకీయాలు ఎప్పటికి మంచివి కావని.. ఇలాంటివి మొదలుపెట్టినప్పుడు బాగానే ఉన్నా.. తర్వాతి కాలంలో వాటి కారణంగా తానూ ఇబ్బంది పడాల్సి వస్తుందన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారు.
తాను అధికారంలోకి వచ్చినంతనే చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసిన జగన్ అక్కడితో ఆగలేదు. ఇప్పుడు బాబు అద్దెకు ఉండే నివాసాన్ని కూల్చేయటం ద్వారా ప్రతీకారం తీర్చుకోవటంలో తనకు తానే సాటి అన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. అధికారం ఎప్పుడూ ఒక్కరి సొత్తు కానేకాదన్న విషయాన్ని యువనేత ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి తత్వాలు అంత త్వరగా బోధ పడే అవకాశం ఉంటుందా?