జగన్ ఆలోచన ఏంటో స్పష్టంగా తెలుస్తోంది

July 10, 2020

జగన్ అనాలోచిత పరిపాలన విధానం రాష్ట్ర ప్రజల దృష్టిని మారుస్తోంది. కూల్చివేతల విషయంలో ముఖ్యమంత్రి జగన్ విధానం తప్పు కాకపోవచ్చు... కానీ పద్ధతి లేదు. కేవలం కక్ష పూరిత కూల్చివేతలు తప్ప ఒక పాలసీ లేదు. ఇది తాత్కాలికంగా జగన్ కి మైలేజీ తెచ్చినా దీర్ఘకాలికంగా రాష్ట్రానికి నష్టం, జగన్ రాజకీయ భవిష్యత్తుకు నష్టమే. అక్రమ కట్టడాల కూల్చివేత కచ్చితంగా అభినందనీయ నిర్ణయమే. అయితే, ముందు దానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేసి జిల్లాలు, పట్టణాల వారీగా అక్రమ నిర్మాణాలు గుర్తించాలి. ఎక్కడ ఎన్ని ఉన్నాయి. అనుమతులు లేకుండా ఉన్నవి, కట్టకూడని చోట కట్టినవి అంటూ క్రోడీకరించి ఒక జాబితా తయారుచేయాలి. అందరికీ నోటీసులు ఇచ్చి అపుడు ప్రాథమ్యాల ప్రకారం కూల్చివేతలు మొదలుపెట్టాలి. అంతేగాని... ఒక టౌన్ ప్లానింగ్ అధికారిలాగా ముఖ్యమంత్రి జగన్ మారిపోయాడు. సాధారణ పరిపాలన, రాష్ట్ర భవిష్యత్తును గాలికి వదిలేసి కూల్చివేతల మీద దృష్టిపెట్టారు. తెలుగుదేశం నేతలవి మాత్రమే కూల్చడంలోనే దీని అంతరార్థం ఏంటో అర్థమవుతుంది.

కూల్చివేతల్లో ఇప్పటికవరకు ఒక్క వైసీపీ నేత బిల్డింగు కనిపించలేదు. అంత పెద్ద వైజాగ్ లో కేవలం గంటా ఆఫీసీ, మురళీ మోహన్ బిల్డింగులుల మాత్రమే ఎందుకు అధికారులకు కనిపించాయి. మిగతా అక్రమ నిర్మాణాల సంగతి ఏంటి? దీన్ని బట్టే  తెలుగుదేశం నేతలను వేధించడం తప్ప ప్రభుత్వం ఇంకో లక్ష్యం పెట్టుకోలేదని స్పస్టమవుతోంది. తాజాగా కృష్ణానదీ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు పంపించారు. ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసం ఉందన్న సంగతి తెలిసిందే. 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం దీనిలోనే స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్, అదనపు గదులను నిర్మించి, చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు. ఇపుడు దానికి నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఇంటికి నోటీసులు అతికించారు. లేదంటే కూల్చేయాలని ఆదేశించారు. ఈ నోటీసులు భవన యజమాని లింగమనేని రమేశ్ పేరిట జారీ చేశారు. కరకట్టపై అక్రమంగా ఈ భవంతిని నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. గెస్ట్ హౌస్ సహా స్విమ్మింగ్ పూల్, హెలీ ప్యాడ్ లకు అనుమతి లేదని ప్రస్తావించారు. అంటే చంద్రబాబు చేత వెంటనే ఇల్లు ఖాళీ చేయించి అవమానించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.