రాజధాని మార్పు: టెస్టింగ్ మోడ్ లో జగన్ ??

July 02, 2020

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాట రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. రాజధాని అమరావతి కోసం ఎంతో విలువైన తమ భూములు ఇచ్చి... తరువాత తరాల భవిష్యత్తుకు రాజధానిపైనే ఆశలు పెట్టుకున్న ఆ ప్రాంత రైతులు, ప్రజలు... రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశలు పెట్టుకున్న వ్యాపారులు, పెట్టుబడిదారులు... అక్కడ భూములు కొనుక్కున్న బడాబాబులు, రాజకీయనాయకులు దీనిపై ఆందోళన చెందుతుండగా... రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని సరిగ్గా అంచనా వేయలేక, వేరే ప్రాంతంలో భూములు కొనుక్కుని నష్టపోయామనుకుంటున్నవారు, దొనకొండ వద్ద భూములు కొన్న నేతలు మాత్రం సంతోషిస్తున్నారు.
అయితే.. జగన్ ప్రభుత్వం ఇంతకీ నిజంగానే రాజధానిని మార్చబోతుందా? లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశ్నలతో పాటే వాటికి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మార్పుపై చర్చలకు ఊతమిచ్చేలా బొత్స చేసిన కామెంట్లకు రకరకాల బాష్యాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏర్పడి సుమారు 3 నెలలవుతున్నా జగన్ పాలన ఇంకా గాడిన పడకపోవడం... రాజకీయ కక్ష్య సాధింపులే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన సరైన అడుగులు ఇంకా పడకపోవడం.. వరదలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వంటివన్నీ విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి.. దీంతో జగన్ ప్రభుత్వంపై జనం పెట్టుకున్న ఆశలు మెల్లమెల్లగా కరుగుతున్న సూచనలు కనిపిస్తుండడంతో జనాల దృష్టిని మళ్లించడం కోసం చర్చను రాజధాని మార్పుపైకి తీసుకెళ్లినట్లుగా భావిస్తున్నారు.
అదేసమయంలో రాజధాని విషయంలో అయోమయం క్రియేట్ చేసి దాన్ని సొమ్ము చేసుకునే ఉద్దేశాలతోనూ ఈ రకమైన గేమ్ ఆడుతున్నట్లుగా భావిస్తున్నారు. అమరావతిపై అయోమయం సృష్టించి.. రాజధాని తరలిపోతుందన్న భయాలతో రియల్ వ్యాపారాన్ని పడగొట్టి తక్కువ ధరలకు వైసీపీ నేతలు భూములు సొంతం చేసుకుని ఆ తరువాత తమ భూములున్న ప్రాంతాల్లో రాజధాని కీలక నిర్మాణాలు, ప్రాజెక్టులు తీసుకొచ్చి లాభపడే దురుద్దేశాలూ ఉండొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో నిజంగానే రాజధాని మార్చాలన్న ఆలోచనతో ఉండి అసలు దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకునేందుకు బొత్స ద్వారా లీక్ చేసి ఉంటారని... ప్రజలు వ్యతిరేకిస్తున్నారా... అంగీకరిస్తున్నారు.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షానికి ప్రజల మద్దతు దొరుకుతుందా అనేది చెక్ చేసి దానికి అనుగుణంగా ముందడుగు వేసే ఉద్దేశంతో లీకులిచ్చారని భావిస్తున్నారు.