జగన్ నిర్ణయాన్ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

July 03, 2020

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధిండంతో ఎవరినీ సంప్రదించకుండానే అన్ని నిర్ణయాలను తీసుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలోనూ ఆయన ఇదే తరహాలో వ్యవహరించారు. స్పీకర్‌గా పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను ఖరారు చేసిన విషయం తెలిసిందే. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం తమ్మినేనికి సంబంధించిన వీడియోనే.

 సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ్మినేని సీతారాం ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో తన చదువు గురించి కూడా చెప్పారు. అయితే, చదువు విషయంలో జాగ్రత్తగా చెప్పకపోతే బుక్ అవుతానని అనుకున్నారేమో ఏమో.. ఆయన ప్రత్యేకంగా చెప్పాలనుకున్నారు. ‘‘నేను ఇంటర్‌లో సీఈసీ గ్రూప్ తీసుకున్నాను. సీఈసీ అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. అధికార తెలుగుదేశం పార్టీలోని మేధావుల్లా నేను తప్పు చెప్పను’’ అన్నారు.

 డిగ్రీలో మాత్రం హెచ్ఈసీ చదువుకున్నానని చెప్పడంతో, యాంకర్ దిమ్మతిరిగింది. హెచ్ఈసీ అనే గ్రూప్ ఇంటర్‌లో కదా ఉండేది అని సదరు యాంకర్ చెప్పడంతో తమ్మినేని అవాక్కయ్యారు. అప్పుడు తడబుడతూనే యాంకర్ సాయంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. డిగ్రీలో ఈహెచ్‌పీ అని చెప్పారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బీకాంలో ఫిజిక్స్’ అన్న ఎమ్మెల్యేకు చంద్రబాబు టికెట్ కూడా ఇవ్వలేదని, కానీ.. జగన్ మాత్రం డిగ్రీలో హెచ్ఈసీ చేసిన వ్యక్తిని ఏకంగా స్పీకర్ చేశారని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

 ఇదిలాఉండగా, శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాబల్యం కలిగిన కళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, ఆ జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితులే. ఆయన ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇలా రాజకీయంగా అత్యంత సీనియర్‌ అయిన సీతారాంకు ఈసారి స్పీకర్‌ పదవి దక్కుతుందని రాజకీయవర్గాలు ముందుగానే ఊహించాయి. ఆ అంచనాలకు తగినట్టే, శుక్రవారం జరిగిన వైసీఎల్పీ సమావేశంలో సీతారాం పేరును జగన్‌ ఖరారు చేశారు. ఆ సమావేశం అనంతరం సీతారాంకు ప్రత్యేకంగా ఇదే విషయం జగన్‌ తెలిపారు. దీనిపై సీతారాం సంతోషం ప్రకటించారు.