టీడీపీ సాక్ష్యాలతో ఇరుకున పడిన జగన్

May 24, 2020

అసెంబ్లీలో టీడీపీ పార్టీ మైనారిటీలో ఉన్నా... విమర్శలతో అధికారాన్ని ఇరుకున పెట్టడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఈరోజు అసెంబ్లీలో జగన్ మరిచిపోయిన హామీల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ 45 సంవత్సరాలకే బడుగుబలహీన వర్గాలకు పింఛను ఇస్తాడని ప్రచారం చేసి జనాలతో ఓట్లేయించుకున్నారని కానీ ఆ మాట తప్పారని తెలుగుదేశం ఆరోపించింది.
ఈ విమర్శపై జగన్ స్పందిస్తూ మా మేనిఫెస్టో చూడండి.. అది లేదు అన్నారు. అయితే, మేనిఫెస్టో ఓటింగ్ కు కేవలం 10-12 రోజుల ముందు మాత్రమే ప్రకటించారు. దీంతో అప్పటికే వైసీపీ చెప్పినవన్నీ జనం నమ్మేశారు. అందులో అత్యధిక పేదలను ఆకర్షించిన పథకం 45కే ఏళ్ల పింఛను పథకం. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను, వైసీపీ వెబ్ సైట్ క్లిప్పింగులను, జగన్ ప్రచారం చేసిన వీడియోలను, సాక్షి పత్రిక క్లిప్పింగులను తెలుగుదేశం చూపించింది.
డిఫెన్సులో పడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపడం మొదలుపెట్టారు. ముందు దీనికి సమాధానం చెప్పి మాట్లాడటమనడంతో అరుపులు, బెదిరింపులతో సభను స్తంభింపజేశారు. చివరకు ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేశారు. వైసీపీ అణిచివేత విధానాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు వాకౌట్ చేశారు. ఆయనతో పాటు టీడీపీ సభ్యులు కూడా వాకౌట్ చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ’’తామేమీ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సభకు కత్తులు, కటార్లతో వెళ్లట్లేదని, వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని అధికారపక్షంపై విమర్శలు చేశారు. బీసీ నాయకుడ్ని సభ నుంచి సస్పెండ్ చేసి బీసీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి. ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ ను అకారణంగా సస్పెండ్ చేస్తే తామెలా ఊరికే కూర్చుంటామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా అభద్రతా భావం నెలకొంటోందని, ప్రభుత్వంలో అసహనం బాగా పెరిగిపోతోందని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై టీడీఎల్పీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని‘‘ చంద్రబాబు ప్రకటించారు.