జ‌గ‌న్‌లో అస‌హ‌నం.. దేనికి సంకేతం..?

October 18, 2019

‘‘వాళ్లు 20 మంది.. మావాళ్లు 150 ఉన్నారు... మా వాళ్లు ఒక్క‌సారి లేచారంటే వాళ్లంతా వాళ్ల‌ స్థానాల్లో కూర్చోలేరు’’ ఇవి బ‌డ్జెట్ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు. ప్ర‌తిప‌క్ష టీడీపీని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడిన మాట‌లు. ఇప్పుడు ఆ వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధికారంలోకి వ‌చ్చిన నెల‌ రోజుల్లోనే జ‌గ‌న్ నోటి నుంచి ఇలాంటి అస‌హ‌న మాట‌లు వినిపించ‌డంపై రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నం కూడా ఆలోచిస్తున్నారు. ఏడాదికిపైగా వేలాది కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసి.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై.. తిరుగులేని విజ‌యంతో అధికారం చేప‌ట్టి.. ఎంతో స‌హ‌నంగా క‌నిపించిన‌ జ‌గ‌న్‌లో ఒక్క‌సారిగా ఈమార్పు దేనికి సంకేతం అనేదానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్దిరోజుల‌కే ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే దిశ‌గా ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కానీ.. ఇదే స‌మ‌యంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట పెడతానంటూ ఆయ‌న హ‌డావుడి మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగానే ప్ర‌జావేదిక‌ను కూల్చివేశారు. దీనిపై వ‌చ్చిన విమ‌ర్శ‌లే ఎక్కువ‌. త‌ట‌స్థులు కూడా జ‌గ‌న్ చ‌ర్చ‌ను త‌ప్పుప‌ట్టారు. ఇందులో రాజ‌కీయ‌ప‌ర‌మైన క‌క్ష సాధింపే ఎక్కువుగా క‌న‌ప‌డుతోంద‌న్నారు.

ఇక టీడీపీ పాల‌న‌లో... అన్నివిభాగాల్లో ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు ఓ క‌మిటీ కూడా వేసి నివేదిక‌లు తెప్పించుకునే ప‌నిలో ఉన్న జ‌గ‌న్‌ మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. అయితే.. ఇక్క‌డి వ‌ర‌కు జ‌నం హ‌ర్షం వ్య‌క్తం చేసినా.. జ‌గ‌న్‌లో ఏదో అస‌హ‌నం క‌నిపిస్తుంద‌నే అభిప్రాయం మాత్రం జ‌నంలో ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఉద్దేశించి.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా ఇది మంచిది కాద‌నే అభిప్రాయానికి వ‌స్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలంటే... రాష్ట్రంలో ఉన్న అందరికీ నచ్చాలి... వైసీపీకి ఓట్లేసిన వారికి మాత్రమే కాదు.. ఆ తేడా తెలుసుకుంటే మంచిది.. అనే టాక్ ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. మంచి ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. ముందుగా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించు.. అంటూ ప‌లువురు సూచ‌న‌లు చేస్తున్నారు. నిజానికి.. వైఎస్సార్ కూడా ఇలాగే ప్ర‌తిప‌క్షాన్ని లెక్క‌చేయ‌కుండా.. క‌నీస మ‌ర్యాద ఇవ్వ‌కుండా మాట్లాడేవార‌ని, ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే దారిలో వెళ్తున్నారా..? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.