జగన్ అమెరికా టూర్... ఇంత కన్ఫ్యూజనేంటి గురూ

August 07, 2020

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... గురువారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. గతంలో అయితే ఫరవా లేదు గానీ.. ఇప్పుడు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. సీఎం పోస్టులో ఉన్న నేత... ఎక్కడికి వెళ్లినా... ప్రత్యేకించి విదేశాలకు వెళ్లినా... పూర్తి క్లారిటీ ఉంటుంది. అయితే జగన్ అమెరికా టూర్ విషయంలో మాత్రం ఈ క్లారిటీ పూర్తిగా మిస్ కాగా... మొత్తంగా ఈ టూర్ పై పెద్ద గందరగోళమే నెలకొంది. ఓ సారేమో సీఎం హోదాలో అధికారిక టూరేనని చెబుతారు, మరోమారేమో సీఎం హోదాలో ఉన్నా కూడా జగన్ అమెరికా పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగతమేనని, అధికారికం ఎంతమాత్రం కాదని చెబుతారు. అంతేకాకుండా... ఈ టూర్ ఖర్చు విషయంలోనూ భిన్న రకాల జీవోలు విడుదలయ్యాయి. దీంతో అసలు జగన్ అమెరికా టూర్ పెద్ద దుమారమే రేపేలా ఉందని చెప్పక తప్పదు.

జగన్ పర్యటనకు సంబంధించి విడుదలైన తొలి జీవోలో జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తమే అమెరికాకు వెళుతున్నారని, ఈ క్రమంలో పర్యటన ఖర్చు మొత్తం జగనే సొంతంగా భరిస్తున్నారని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జగన్ భద్రతకు సంబంధించిన కొద్దిపాటి మొత్తాన్ని మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ జీవో వచ్చిన తర్వాత మరో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోలో జగన్ వెంట అమెరికా వెళుతున్న ప్రభుత్వ సలహాదారు పీవీ రమేశ్, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిల ఖర్చు మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచే విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వీరిద్దరు కూడా జగన్ కు సహాయకులుగానే వెళుతున్నారని కూడా జీవోలో చాలా స్పష్టంగానే ఉంది. మరి జగన్ ది వ్యక్తిగతమైన పర్యటనే అయితే... ఆయన వెంట పీవీ రమేవ్, కృష్ణమోహన్ రెడ్డిలు ఎందుకు వెళుతున్నట్లు అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది.

ప్రభుత్వ ఖర్చులతో సహాయకులను జగన్ తన వెంట అమెరికా తీసుకెళుతున్నారంటే... అది ఖచ్చితంగా అధికారిక పర్యటనే కావాలి. వ్యక్తిగత పర్యటనలకు ప్రభుత్వ ఖర్చులతో సహాయకులను ఎలా తీసుకెళతారన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది. మొత్తంగా జగన్ అమెరికా టూర్ కు వెళుతున్నా... ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయట్లేదు అన్న విషయాన్ని ప్రచారం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన యత్నం ఇలా బెడిసికొట్టిందన్న మాట. అయినా ప్రజల సొమ్మును ఖర్చు చేసే విషయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్... సాక్షాత్తు తన విదేశీ పర్యటనలోనే ఇలా రెండు మాటలు చెప్పడం చూస్తుంటే... ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.