జగన్ అమెరికా టూర్.. ఎన్నారై సంఘాల అత్యుత్సాహం

August 06, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ టూర్ల విషయంలో కేసీఆర్ ను కాకుండా మోడీనే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. మొన్న జెరూసలెం టూర్ వెళ్లొచ్చిన జగన్... ఇపుడు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇటీవలే అమెరికా వెళ్లొచ్చారు. మళ్లీ మరోసారి అమెరికా వెళ్తున్నారు. ఈ నెల 15 నుంచి 24 వరకూ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్తున్నారు. 24వ తేదీన తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఆగస్టు 15 న స్వతంత్ర దినోత్సవాలు ముగించుకుని సాయంత్రం హైద్రాబాద్ నుంచి ఆయన బయలుదేరుతారు.

17 న తెలుగు వారు అధికంగా ఉండే డాలస్ లో ప్రవాస తెలుగు వారితో జగన్ భారీ సభ ప్లాన్ చేశారు. అయితే, ఇది వివాదాస్పదం అవుతోంది. తెలుగు సంఘాలు జగన్ సభకు హాజరుకమ్మని అధికారికంగా మెయిల్స్ పెడుతున్నాయి. వీటిలో టాటా వంటి తెలంగాణ సంఘాల నుంచి మెయిల్స్ రావడం విచిత్రం. సరే తెలుగు ముఖ్యమంత్రి కదా అలా పెట్టారు అనుకుందామంటే... గతంలో చంద్రబాబు పర్యటనలకు వారిలా అధికారికంగా ఆహ్వానించలేదు. మరి ఇందులో మతలబు ఏంటో.
ఇదిలా ఉంటే... రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే క్రమంలో ఆయన ఎన్నారైలలో నమ్మకం కల్పించేందుకు ఈ పర్యటన చేస్తున్నారు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. వాస్తవం వేరుగా ఉంది. ఇంతవరకు జగన్ కు ఎన్నారైలకు మధ్య పెద్దగా సంబంధాలు లేవు. వాటిని బలపరుచుకోవడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.