అయ్యో జ‌గ‌న్‌...విశాఖ‌లో ఇలా జ‌రిగిందేంటి?

February 24, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విశాఖ టూర్ గురించి ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలిసారి ఉక్కు న‌గ‌రంలో అడుగు పెట్టిన సీఎం జ‌గ‌న్‌కు ఘ‌నంగా స్వాగ‌తం చెప్పేందుకు వైసీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్ర‌తిష్టాత్మకమైన విశాఖ ఉత్సవాలను ప్రారంభించనున్న సంద‌ర్భంగా జ‌రిగిన ఈ ఏర్పాట్ల‌లో...ప్ర‌చారం ఒక‌టైతే..వాస్త‌వం మ‌రొక‌టి అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎం జ‌గ‌న్ విశాఖ‌ టూర్లో బోసిపోయిన రోడ్లు క‌నిపించాయంటున్నారు కొంద‌రు నెటిజ‌న్లు.
విశాఖలో సీఎం జగన్ పర్యట‌న నేప‌థ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. 50వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు హాజరుతో ఆర్కే బీచ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామ‌ని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచిపార్టీ శ్రేణులు భారీగా తరలి రానున్నాయని పేర్కొన్నారు. భారీ ర్యాలీగా ముఖ్యమంత్రిని ఆహ్వానించి.. ఆయన ప్రయాణించే మార్గంలో మానవహారాలు, పూల వర్షాలు కురిపించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఎయిర్ పోర్ట్ నుంచి సభావేదిక వరకూ సుమారు 24కిలోమీటర్ల మేర ఘనమైన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, క్షేత్ర‌స్థాయిలో మ‌రో ర‌క‌మైన ప‌రిస్థితి ఎదురైంది. రోడ్లు బోసిపోయి క‌నిపించాయి.
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం సీఎం జగన్ విశాఖకు చేరుకోగా...ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికే స‌మ‌యంలో విశాఖ‌లో రోడ్లపై పెద్ద‌గా సంద‌డి క‌నిపించ‌లేదు. జ‌గ‌న్‌ కాన్వాయ్ సాగిపోతుంటే..తీసిన వీడియోలు ప‌లువురు ట్విట్ట‌ర్లో పోస్ట్ చేయ‌గా...ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. దీంతో...ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్‌గా ప్ర‌క‌టించిన అనంత‌రం సైతం సీఎం జ‌గ‌న్‌కు ఇలాంటి స్పంద‌న రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.