మంత్రుల గొంత మీద జగన్ కత్తి

May 31, 2020

ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగటం మామూలే. అన్ని మంత్రివర్గ సమావేశాలు ఒక్కటిలా ఉండవన్న విషయమే కాదు.. ముఖ్యమంత్రి జగన్ ఎంత కరకుగా ఉంటారన్న విషయం ఏపీ మంత్రులకు తాజాగా తెలిసి వచ్చింది. సుత్తి లేకుండా సూటిగా.. కుండబద్ధలు కొట్టేసిన వైనంతో ఏపీ మంత్రులు అవాక్కు అయ్యారని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయంపై క్లియర్ గా చెప్పేశారు జగన్.

ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రుల్ని బాధ్యుల్ని చేసేసిన ఆయన.. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎక్కడ ఓడితే.. అందుకు బాధ్యులైన మంత్రులు తనను కలవాల్సిన అవసరం లేదని.. ఫలితం వచ్చినంతనే ఓటమికి బాధ్యులైన మంత్రులు నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా పత్రాల్ని అందజేయాల్సి ఉంటుందని తేల్చేసిన వైనంతో దిమ్మ తిరిగిపోయిందంటున్నారు.
జగన్ మంత్రివర్గంలో చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇప్పటికే వారు పలువురు ముఖ్యమంత్రుల్ని చూడటంతో పాటు.. వారి కింద పని చేసిన అనుభవం కూడా ఉంది. కానీ.. మరే ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ఫలితాలకు ఎంతలా బాధ్యత వహించాలన్న విషయాన్ని ఇంతలా ఎవరూ చెప్పింది లేదంటున్నారు. జగన్ మాటల్ని విన్నంతనే.. గొంతు మీద కత్తి పెట్టి మరీ టార్గెట్ పెట్టినట్లుగా అనిపించినట్లు ఒక మంత్రి లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం.