వైరల్ పిక్- ముఖ్యమంత్రి బాలయ్య మాజీ అభిమానా?

April 03, 2020

ఈ హెడ్డింగ్ చూసి.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. అయితే అది ఇప్పటి మాట కాదు. రెండు దశాబ్దాల కిందటి సంగతి. యుక్త వయసులో ఉండగా కడప జిల్లాలో చాలామంది కుర్రాళ్ల లాగే వైఎస్ జగన్ సైతం బాలయ్యకు వీరాభిమాని. అతను కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘానికి అధ్యక్షుడు కూడా. అప్పట్లో ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూడటం.. థియేటర్ల దగ్గర తన అభిమాన హీరో కోసం బేనర్లు కట్టడం లాంటివన్నీ చేసేవాడు జగన్. 1999లో ఆంధ్రప్రదేశ్‌ను షేక్ చేసే విజయం సాధించిన ‘సమరసింహారెడ్డి’ సినిమా బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేసేలా చేసింది. ఈ సినిమా కొన్ని సెంటర్లలో ఏడాది పాటు ఆడింది. 1999 సంక్రాంతికి విడుదలై.. 2000 సంక్రాంతి వరకు కూడా ఆడిందీ చిత్రం. ఈ సందర్భంగా ‘సమర సింహారెడ్డి 365 డేస్’ పోస్టర్2తో 2000వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు జగన్ అప్పట్లో ఒక యాడ్ ఇవ్వడం విశేషం.
ఆ ప్రకటనలో నందమూరి హీరోను ‘మా బాలయ్య బాబు’ అని సంబోధించాడు జగన్. అతడి పేరు కింద ‘ప్రెసిడెంట్.. కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం’ అని ఉండటం గమనార్హం. జిల్లా బాలయ్య అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడంటే బాలయ్యకు జగన్ ఎంతటి వీరాభిమానో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యే ముందు వరకు జగన్ ఒక సాధారణ కుర్రాడే. రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక ఇటు వైపు అడుగులేశాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీ కూడా అయ్యాడు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలన్నీ తెలిసినవే. ఇప్పుడు జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తన అభిమాన హీరో జస్ట్ ఎమ్మెల్యేగా ఉండగా.. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం విశేషమే.