జగన్ గెలిస్తే రాజధానిని అక్కడికి మార్చేస్తాడా..?

December 06, 2019

 ఆంధ్రప్రదేశ్ లో రోజుకో సరికొత్త అంశం తెరపైకి వస్తోంది. ప్రజాభిమానం చూరగొంటూ టీడీపీ దూసుకుపోతుంటే.. ఈ సారి ఎలాగైనా గెలవాలనే ఆశయంతో వైసీపీ ముందుకెళ్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మధ్యనే అసలైన పోరు ఉందని అర్థమవుతోంది. అయితే ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని వేరొక చోటుకి తరలిస్తాడని జనంలో చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీలో జగన్ మాట్లాడిన తీరు చుస్తే అది నిజమే అని కూడా తెలుస్తోంది. ఢిల్లీ మీడియా వర్గాలతో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో కలకలం రేపుతున్నాయి.

 

 

సాధారణంగానే జగన్.. అమరావతి గురించి పాజిటివ్‌గా మాట్లాడిన సందర్భాలు అస్సలే లేవు. పైగా అమరావతిలో ఏమీ లేదని చెబుతుంటారు కూడా. జగన్ తీరు మొదటి నుంచి తేడాగానే ఉంది. అమరావతిని రాజధానిగా చేయడంపై జగన్ ఏ మాత్రం సుముఖంగా లేరు. కనీసం శంకుస్థాపనకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించినా రాలేదు. ఇక 50వేల కోట్ల రూపాయలతో అమరావతిలో రాజధాని పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అన్ని జిల్లాల నుంచి ప్రజలను బస్సుల్లో తీసుకెళ్లి మరీ చూపిస్తోంది. వారంతా ఊహించిన దానికి మించి ఇక్కడ అభివృద్ధి కనిపిస్తోందని చెబుతుంటే.. జగన్ మాత్రం అక్కడి అభివృద్ధిని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తేనే ఆయనలో మరో ఆలోచనలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీలో వ్యాఖ్యలు చేశారనేది ప్రస్తుతం హాట్ టాపిక్.

 

 

తాను ముఖ్యమంత్రి అయితే దొనకొండ ప్రాంతంలో రాజధాని ఉంటుందని గత ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారు. దీంతో జగన్ బంధువులు, పులివెందుల పబ్లిక్ అక్కడకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొని పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే..  తాము గెలిస్తే అమరావతినే రాజధానిగా ఉంటుంది. కావాలంటే మేనిఫెస్టోలో పెడతాం.. అంటూ కొద్ది రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. దీంతో అమరావతిని మేనిఫెస్టోలో పెట్టడం ఏంటి? అనే చర్చ అప్పుడే మొదలైంది. అంటే వైసీపీలో రెండో ఆలోచనలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అప్పుడు విమర్శలు కూడా చేశాయి. ఇప్పుడు జగన్ ఢిల్లీలో మాట్లాడిన మాటలు ఆ ఆలోచనలను తెరపైకి తీసుకొచ్చాయి. అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే.. అమరావతిని మార్చి తన, తన వర్గం యొక్క లాభం కోసం రాజధాని మార్పు కోసం జగన్ యత్నిస్తున్నాడనేది స్పష్టమవుతోంది.