సెన్సేషన్ - లాక్ డౌన్ కొనసాగింపునకు జగన్ నో?

June 06, 2020

యావత్తు దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ. కరోనా వైరస్ వ్యాప్తి, రోజూ పదులు, వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసుల నమోదు, వైరస్ నివారణకు అటు కేంద్రంతో పాటు ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే... కేంద్ర ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ గడువు ఈ నెల 14తో ముగియనుండగా... తదుపరి కేంద్రం నిర్ణయం ఏమిటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ ను ఎత్తేస్తారా? లేదంటే... మరింత కాలం పాటు పొడిగిస్తారా? పొడిగిస్తే... ఇంకా ఎన్ని రోజుల పాటు పొడిగిస్తారు? అన్న విషయాలపై పెద్ద చర్చే జరుగుతోంది. అయితే కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో మరింత కాలం పాటు లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ ఎత్తేసే దిశగానే ఆలోచన చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఏపీ అధికార యంత్రాంగం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది.

అయినా ఏపీలో కరోనా వ్యాప్తి ఓ మోస్తరులో తగ్గినా... వైరస్ పూర్తిగా తన వ్యాప్తిని తగ్గించలేదనే చెప్పాలి. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 350 దరిదాపుల్లోకి చేరిపోయినా...ఇంకా చాలా కేసులను ప్రభుత్వమే దాస్తోందన్న ఆరోపణలు కూడా కలకలం రేపుతూనే ఉన్నాయి. అదే సమయంలో కరోనా తీవ్రతను చాలా చిన్నగా చూపించే యత్నం చేసిన జగన్ వైఖరిపై ఆదిలోనే పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. ఓ వైపు ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతుంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందేన్న రీతిలో జగన్ చేసిన వాదన నిజంగానే అందరినీ షాక్ కు గురి చేసింది. ఇలాంటి ఒంటెత్తు పోకడలతో జగన్ వ్యవహరిస్తే... రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడిపోయే ప్రమాదం లేకపోలేదన్న ఆరోపణలు వినిపించాయి.

ఇలాంటి నేపథ్యంలో కరోనా విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్న జగన్... ఇప్పుడు లాక్ డౌన్ ను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఎత్తేసే దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజంగానే ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నెల 14తో కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ గడువు ముగియగానే... ఏపీలో లాక్ డౌన్ ను పొడిగించేదేమీ లేదన్న రీతిలో జగన్ సాగుతున్నారట. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే తన అధికార యంత్రాంగం ముందు పెట్టారట. అయినా జగన్ లాక్ డౌన్ ను ఎత్తేసే దిశగా ఎందుకు సాగుతున్నారన్న విషయానికి వస్తే.. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బ తిన్నదని, మరింత కాలం లాక్ డౌన్ అంటే... రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమని జగన్ భావిస్తున్నారట. ఈ కారణంగానే ఆయన లాక్ డౌన్ ను ఎత్తేసే దిశగా సాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక పరిస్థితి సరే.. మరి కరోనా వ్యాప్తి తగ్గకుండానే లాక్ డౌన్ ఎత్తేస్తే... ప్రజల పరిస్థితి ఏమిటి? లాక్ డౌన్ ఎత్తివేతతో ప్రజలు ఒక్కసారిగి బయటకు వస్తే... కరోనా తన విశ్వరూపం చూపితే పరిస్థితి ఏమిటి? ఇవే అంశాలపై ఆలోచన చేస్తున్న అధికారులు... లాక్ డౌన్ పై జగన్ వైఖరిని తెలుసుకుని జడిసిపోతున్నారట.