ఆ నిర్ణయంతో చంద్రబాబును హీరో చేస్తున్న జగన్

July 10, 2020

ప్రతిపక్షంలో ఉన్నంత స్వేచ్ఛ అధికారంలో ఉన్నపుడు ఉండదు. వినడానికి కఠినంగా ఉన్నా... ఇది పచ్చి నిజం. జగన్ ఇపుడు అలాంటి చాలా సంకటాలను ఎదుర్కొంటున్నారు. జగనే కాదు, అధికారంలో ఎవరున్నా ఈ పరిస్థితి రాక తప్పదు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్ ఏ విషయంపై ఏం మాట్లాడినా అది మైలేజీ తెచ్చిపెట్టింది. తప్పులు ఒప్పులయ్యాయి. కానీ ఇపుడు ఒప్పులు కూడా తప్పులవుతాయి. ఇక ఏకంగా తప్పులు చేస్తే అవి ప్రమాదమై కాటేస్తాయి. తాజాగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ... ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఆపితే చంద్రబాబు హీరో అవుతాడు అని ఆయన వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టు ఆపితే చంద్రబాబు ఎలా హీరో అవుతాడు అనుకుంటే... ఒకసారి తరచి తరచి ఆలోచించండి. చంద్రబాబు హయాంలో నాలుగు సంవత్సరాల పాటు పోలవరం నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నట్టు ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేకపోలేదు. వాస్తవం కంటే కొంచెం ప్రచారం ఎక్కువ జరిగిందేమో గాని... ప్రాజెక్టు నిర్మాణం మాత్రం చాలావరకు పూర్తయిన విషయం నిజమే. ఇపుడు జగన్ పదవిలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును అలా నిర్మాణంలో వదిలేయకుండా... రివర్స్ టెండరింగ్ అంటూ ఆపేశాడు. ఒక నీటి ప్రాజెక్టు ఎపుడైనా ఎంత త్వరగా కడితే అంత మంచిది. ఎందుకంటే... ఏ ప్రాజెక్టు కట్టినా అనేక రకాల కేసులు నమోదవుతుంటాయి. ఎపుడు ఏది ఎలాంటి తీర్పును నెత్తిమీద తెచ్చిపెడుతుందో తెలియదు. ప్రాజెక్టు కట్టేశాక ఏ కోర్టులు కూల్చమని చెప్పలేవు. అందుకే ప్రాజెక్టుల విషయంలో కెలుక్కుంటే చాలా ప్రమాదం. పార్టీలకు నష్టం. ఇక జగన్ నిర్ణయాల వల్ల పోలవరం ఇప్పట్లో పూర్తి కాదేమో అన్న అనుమానాలు జనాలకు మెల్లగా కలుగుతున్నాయి.
ఎన్నికల ముందు చంద్రబాబు కూడా జగన్ వస్తే పోలవరం, అమరావతి ఆగిపోతాయని చెప్పారు. ఇపుడు జగన్ పోలవరం ప్రాజెక్టును కెలికితే దానివల్ల జరిగే ఆలస్యంతో ప్రాజెక్టు ఎన్నేళ్లు వాయిదా పడుతుందో తెలియదు, ఎపుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. చంద్రబాబు ఉంటే... ఈపాటికి ఇంకొంత ప్రాజెక్టు పూర్తయ్యేది అని జనం నమ్ముతున్నారు. జగన్ నిర్ణయాలపై అన్నిచోట్ల అసంతృప్తి రగులుతోంది. సొంత పార్టీలోనూ జగన్ పట్ల ఇటీవల అసంతృప్తి పెరుగుతోంది. ధర్నాలు, రాస్తారోకోలు, ఎమ్మెల్యేలను నిలదీతలు, పెింఛన్ల ఆలస్యం ఒకటా రెండా అనేకం చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో పోలవరం కనుక ఏ మాత్రం ఆలస్యం అయినా... జాతీయ స్థాయిలో చంద్రబాబు జగన్ ను బద్నాం చేస్తారు. అపుడు ప్రజలు కూడా బాబుకే మద్దతు ఇస్తారు. ప్రతిపక్షం అంటే పవర్ ఫుల్ అని. సమాధానం చెప్పినా కష్టమే, చెప్పకపోయినా కష్టమే. అందుకే టీజీ వెంకటేష్ చెప్పింది అక్షరాలా నిజం. పోలవరం ఆగితే చంద్రబాబు హీరో అవడం ఖాయం.