జగన్‌ కాళ్ల బేరం!

June 02, 2020
కేసుల మాఫీ కోసం
బీజేపీ నేతల చుట్టూ చక్కర్లు
రిలయన్స్‌ అంబానీ సన్నిహితుడు
నత్వానీకి రాజ్యసభ సీటు
వైఎస్‌ను ముఖేశ్‌ హత్య చేశారని నాడు ఆరోపణలు
అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తని వైనం
ఇప్పుడు అమరావతికి పిలిపించుకుని మర్యాదలు
లక్ష కోట్ల అక్రమాస్తుల వ్యవహారంలో నాడు జైలుకెళ్లిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు నాటి యూపీఏ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాళ్లుపట్టుకున్నారన్న ఆరోపణలు జగద్విదితం. వీటిలో నిజం ఉందని.. తదనంతర కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. మతతత్వ బీజేపీకి సహకరించేది లేదని.. యూపీఏకే మద్దతిస్తానని జాతీయ మీడియాలో తరచూ చెబుతూ వచ్చారు. ఆయన రెండు నాల్కల ధోరణి కారణంగా 2014లో నవ్యాంధ్ర ప్రజలు ఓడించారు. ఇప్పుడు సీఎం అయ్యాక కేసుల ఉచ్చు బిగుసుకుంటుండడంతో ఈ సారి బీజేపీతో కాళ్లబేరానికి దిగినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి 2014లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసినా.. ప్రధాని మోదీని జగన్‌ స్వయంగా కలిసి.. బీజేపీ అడగకున్నా బేషరతుగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయడమే లక్ష్యంగా.. పరస్పర అవగాహనతో పరోక్షంగా సహకరించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో జగన్‌ అక్రమాస్తుల కేసులు ఎందుకనో ఊపందుకున్నట్లు కనబడ్డాయి. ఆయనకు సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి వీల్లేదని సాక్షాత్తూ మోదీ-అమితషా కనుసన్నల్లో నడిచే సీబీఐ గట్టిగా వాదించింది. దీంతో ప్రత్యేక కోర్టు జగన్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.. దీంతో ఆయన హైకోర్టుకెళ్లారు. త్వరలో దీనిపై విచారణ జరుగనుంది. ఈలోపు కోర్టుకు హాజరు కాకుండా హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఇదే సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందడం, మహారాష్ట్రను కూడా కోల్పోవడం వంటి కారణాలతో రాజ్యసభలో బీజేపీ బలం తగ్గే పరిస్థితి ఏర్పడింది. పైగా రాజ్యసభలో వైసీపీ బలం ఆరు స్థానాలకు పెరగనుంది. కీలక బిల్లుల ఆమోదానికి వైసీపీ మద్దతు బీజేపీకి అత్యవసరం. ఈ పరిణామాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు కనబడుతోంది. బీజేపీ పెద్దలతో నెయ్యానికి విజయసాయిరెడ్డిని రాయబారానికి పంపారు. తమకు దక్కే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇస్తానని.. అడిగితే రెండయినా ఇస్తానని ప్రతిపాదించారు. ఇందుకు ప్రతిఫలంగా తనను కేసుల నుంచి బయటపడేయాలని షరతు విధించినట్లు చెబుతున్నారు. బీజేపీ పెద్దలకు సన్నిహితుడైన ముఖేశ్‌ అంబానీ ద్వారా పని పూర్తిచేసుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానికి ముఖేశ్‌ కారణమని.. హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక ఆయన హస్తం ఉందని తన పత్రికలో, చానల్లో జగన్‌ పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆయన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల.. ఊరూరా తిరిగారు. అంబానీయే వైఎస్‌ను చంపించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. జనం సానుభూతితో 14 స్థానాల్లో వైసీపీని గెలిపించారు. జగన్‌ ఇప్పుడు సీఎం అయ్యాక తిరుపతిలో రిలయన్స్‌ హార్డ్‌వేర్‌ పార్కు ఏర్పాటుకు సహాయ నిరాకరణ చేశారు. అయితే ఆ తర్వాతి పరిణామాల్లో ముఖేశ్‌ ద్వారా కేసుల వ్యవహారంలో బీజేపీ నుంచి సానుకూలత పొందాలని ప్రయత్నించారు. ముంబై వెళ్లి కలవాలని చూశారు. కానీ అంబానీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దాంతో జగన్‌ వేరే వ్యూహం ఆలోచించారు. కేంద్ర హోంమంత్రి అమిత షాను కలిసి రాజ్యసభ సీట్ల ఆఫర్‌ ఇచ్చారు.
నత్వానీ ద్వారా నరుక్కొచ్చారు..
రిలయన్స్‌ గ్రూప్‌ (కార్పొరేట్‌ వ్యవహారాలు) ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీ జార్ఖండ్‌ నుంచి రాజ్యసభకు రెండుసార్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ మద్దతుతో రెండు సార్లూ ఆయన ఇండిపెండెంట్‌గా గెలవడం విశేషం. అయితే ఇప్పుడక్కడ జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్‌జేడీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. బీజేపీ ఒక్క సీటయినా దక్కించుకునే పరిస్థితి లేదు. దీంతో నత్వానీని ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలా అని బీజేపీ పెద్దలు ఆలోచించారు. విజయసాయిరెడ్డి ద్వారా ఈ విషయం తెలుసుకున్న వారు.. ఆంధ్ర నుంచి నత్వానీని పంపే అవకాశం ఉందని ముఖేశ్‌కు సమాచారమిచ్చినట్లు తెలిసింది. ఈ పరిణామాలను విజయసాయి తన అధినేతకు తెలియజేశారు. అంతే.. ఫిబ్రవరి 29న రావాలని జగన్‌ అంబానీని అర్థించారు. దాంతో ఆకస్మికంగా నత్వానీని, తన చిన్నకుమారుడు అనంతను వెంటపెట్టుకుని ముఖేశ్‌ దిగిపోయారు. నేరుగా తాడేపల్లి వెళ్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు. సీఎం ఆయనకు రాచమర్యాదలు చేశారు. నత్వానీకి రాజ్యసభ సభ్యత్వానికి మార్గం సుగమం చేశారని అంటున్నారు. ఏప్రిల్లో ఖాళీ అయ్యే 51 స్థానాల్లో అత్యధికం బీజేపీ, కాంగ్రెస్‌లవే. బీజేపీకి సంబంధించిన సీట్లు 18 ఖాళీ అవుతుండగా, ఆ పార్టీ నుంచి 13 మంది మాత్రమే ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్‌ సభ్యులు 11 మంది రిటైర్‌ అవుతుండగా, 10 మంది తిరిగి ఎన్నికయ్యే వీలుంది. టీఎంసీ 5,  బిజూ జనతాదళ్‌ నుంచి ఇద్దరు, వైసీపీ నుంచి నలుగురు, టీఆర్‌ఎస్‌, ఆర్‌జేడీ, జేడీ (యు), ఎన్‌సీపీల నుంచి ఇద్దరు చొప్పున, శివసేన, డీఎంకె, జేఎంఎం నుంచి చెరొకరు ఎన్నికవుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కోల్పోయే నాలుగు సీట్లు ప్రాంతీయ పార్టీలకే దక్కనున్నాయి. అంటే కీలక బిల్లులపై ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడక తప్పని పరిస్థితి. వైసీపీ మద్దతు కావాలంటే దాని కోర్కెలు తీర్చాల్సిందే. అయితే ఈ కోర్కెలు రాష్ట్రానికి సంబంధించినవి కావు. జగన్‌ వ్యక్తిగత వ్యవహారాలే. పైకి శాసనమండలి రద్దు, హైకోర్టు తరలింపునకు ఆమోదం, రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సాయం అందించాల్సిందిగా జగన్‌ మోదీ-షాలను కోరారని వైసీపీ వర్గాలు చెబుతున్నా.. అసలు అంశం మాత్రం ఆయన కేసులేనని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.