సంక్షేమం బోగస్‌-పథకాల డాబు-లబ్ధిదారులకు షాకు

May 29, 2020

సంక్షేమం బోగస్‌
పథకాల డాబు.. లబ్ధిదారులకు షాకు
అమ్మఒడి స్కీంలో అన్నీ మెలికలే
82 లక్షల నుంచి 42 లక్షలకు తగ్గిపోయిన తల్లులు
కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే కట్‌
ఆధార్‌ లింకేజీలో మాయాజాలం
సెంటు భూమి లేకపోయినా భూస్వామేనట
ఎడాపెడా అనర్హత వేటు
భారం తగ్గించుకునేందుకు ఎత్తులు
మత్స్యకారులకూ బోలెడు ప్రతిబంధకాలు
ఇంకే పథకం లబ్ధీ పొందకూడదట!
జగన్‌ మార్కు సంక్షేమమిదీ!
నవ్యాంధ్రలో జగన్‌ మార్కు సంక్షేమం నడుస్తోంది. అర్హులపై అనర్హత వేటు వేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులన్న ముద్ర వేసి.. సంక్షేమానికి వారిని దూరం చేస్తున్నారు. ‘అమ్మఒడి’ పథకంలో, మత్స్యకారుల భరోసాలో కనీవినీ ఎరుగని చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పథకాలను విస్తరిస్తున్నట్లు చెబుతూ.. లబ్ధిదారులను కుదించేస్తున్నారు. 82 లక్షల మంది తల్లులకు గాను 42 లక్షల మందికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే 300 యూనిట్లకు మించి విద్యుత వినియోగం ఉన్న కుటుంబానికి అమ్మఒడి సాయం అందదన్న నిబంధన పెట్టారు. అంతే.. తమకు నచ్చనివారికి ఈ సాయం అందకుండా అడ్డుకునేందుకు దీనిని అధికారులు, వైసీపీ నేతలు సాకుగా తీసుకున్నారు. 150 యూనిట్లకు మించి వినియోగించని వారిని కూడా ఈ గాటన కట్టి అనర్హత వేటు వేసేశారు. నిజానికి ఎన్నికల సమయంలో ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ తలో రూ.15 వేల చొప్పున వారి తల్లి ఖాతాలో వేస్తామని జగన్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక.. ఎందరు పిల్లలున్నా.. ఒక్క తల్లికి ఒక్క పిల్ల/పిల్లవాడికే ఇస్తామని మాటమార్చారు. ఇప్పుడు ఒక్కరికి ఇవ్వడానికి కూడా సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. మండు వేసవిలో కూడా 150 యూనిట్లు ఖర్చుచేయని కుటుంబం.. 300 యూనిట్లు వాడేసిందంటూ.. బిల్లులతో నిమిత్తం లేకుండా.. గ్రామ వలంటీర్ల మాటను పట్టుకుని.. అసలు లబ్ధిదారులకు మొండిచేయి చూపుతున్నారు. ఈ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం విద్యుత వినియోగం కారణంగా చూపుతున్నారు. అమ్మకు సాయం చేయడానికి ఇన్ని మెలికలూ, మార్పులూ అవసరమా? పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్‌ విజ్ఞప్తి లాంటి ఆదేశం ఇచ్చారు. తీసుకుంటున్న రూ.15 వేలలో ఒక వెయ్యి రూపాయలను పేరెంట్‌ కమిటీలకివ్వాలని.. తద్వారా పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. కచ్చితంగా సాయం చేయాలని అభ్యర్థించారు. అంటే వారి ఖాతాల్లో వేసేది 14 వేలేనన్న మాట.
ఎన్నికల ముందు దాకా ‘అందరికీ అమ్మ ఒడి’ ఇస్తామన్న వైసీపీ హామీ.. ఆ తరువాత అధికారంలోకి రాగానే ‘కొందరికే..’ పరిమితం చేశారు. కుటుంబంలోని పిల్లలందరికీ ఇస్తామన్న మాట కూడా తిరగబడింది. ఆ కుటుంబంలోని తల్లికే పథకం ఇవ్వాలని నిర్ణయించారు. అదీ అనంతరం మారిపోయింది. కుటుంబంలోని చివరి బిడ్డకే ఇవ్వాలని తీర్మానించారు. అక్కడితో ఆగలేదు.. 75శాతం హాజరు తప్పనిసరి చేశారు. ఇంకోవైపు నుంచి ఈ పథకాన్ని విస్తరించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు తొలుత వర్తింపజేసి.. ఆ తరువాత ఇంటర్మీడియెట్‌కూ విస్తరించారు. అంతవరకు సంతోషమే! కానీ దీనికోసం ప్రకటించిన మార్గదర్శకాలు లబ్ధిదారుల జాబితాకు భారీ కోత విధించేలా ఉండటం అర్హులైన అమ్మలందరిలో ఆందోళనను పెంచుతోంది. కరెంట్‌ వినియోగం 300 యూనిట్లకు పైబడి ఉన్నా...5 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాలకు పైబడి మెట్ట భూమి ఉన్నా.. 4 చక్రాల వాహనం ఉన్నా ఈ పథకం వర్తించదు. గ్రామంలో నివాసం లేకున్నా.. ఇతర ప్రాంతాలకు వలస పోయినా.. విద్యార్థి ఆధార్‌ నంబరు తప్పుగా ఉన్నా.. అవసరమైన వివరాలు వలంటీర్లకు చూపకున్నా ఆ రూ.15 వేలు అందవు. విద్యార్థుల కుటుంబాలకు శల్యపరీక్షలు మొదలుపెట్టారు. గతంలో ఆధార్‌ కార్డులో పేరు, తెల్ల రేషన్‌ కార్డు ఉంటే చాలన్నారు. తాజాగా తెల్లరేషన్‌ కార్డుదారుకు విఽధించిన అర్హతలను ’అమ్మ ఒడి’ పథకానికీ వర్తింపజేస్తూ మార్గదర్శకాలను ఇచ్చారు. విద్యుత వాడకం నిబంధన లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. ఒకరి కరెంటు మీటర్లకు వేరొకరి ఆధార్‌ నంబరును తప్పుగా అనుసంధానం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కరెంటు మీటరే లేకపోయినా.. రాష్ట్రంలో ఎక్కడో ఆయన/ఆమె ఆధార్‌ నంబరు ఏ మీటరుకో అనుసంధానమై ఉంటే.. అనర్హుల జాబితాలో చేర్చేస్తున్నారు. కరెంటు సిబ్బంది చేసిన తప్పు పనులకు లబ్ధిదారులు బలవుతున్నారు. సీఎం సొంత జిల్లా కడపలో ఏకంగా 78 వేల మందిని ఇలా అనర్హులను చేశారు. కుటుంబంలో ఎవరికైనా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటే ఇక ఆ ఇంటికి అమ్మఒడి పథకం వర్తించడం లేదు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అర్హతలు ఉన్నప్పటికీ పలు చోట్ల అమ్మ ఒడిని ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిని ఊహించి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినా.. ప్రయోజనం లేకపోయింది. వారి పిల్లలపై అనర్హత వేటు వేశారు. సెంటు భూమి కూడా లేకున్నా.. భూస్వామిగా చూపి సాయం నిరాకరిస్తున్నారు. తాజాగా 75ు హాజరు నిబంధనకు ఈ ఏడాది వరకు మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులని ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. అరకొర సంపాదనతో, ఉద్యోగం ఎప్పటి వరకు ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్న వీరికి అమ్మ ఒడి పథకంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు విధించడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. సమగ్ర శిక్షణ, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, అన్ని రకాల వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, ప్రభుత్వ/స్థానిక సంస్థల కార్యాలయాలు/ ప్రభుత్వ రంగ సంస్థల్లో  పనిచేసే వారిని అమ్మఒడికి దూరం చేసింది. తాజా మెలికతో చాలా మందికే పథకం దక్కకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు (వార్షికాదాయం రూ.1.20 లక్షలు) , పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు (వార్షికాదాయం రూ.1.44 లక్షలు) వేతనం, ఆపై వేతనం కలిగిన కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులని.. ఆయా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని పాఠశాల విద్యా కమిషనర్‌ జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఖరారుచేయగా.. ఇప్పుడు జగన్‌ జమానాలో.. అడుగడుగునా అర్థం లేని నిబంధనలతో వారి సంఖ్యలో కోతపెట్టేస్తున్నారు.
వేట నిషేధ భృతిపై షరతులు
ఏటా రెండు నెలల పాటు సముద్రంలో మత్స్య సంపద పరిరక్షణ కోసం ప్రభుత్వం మత్స్యకారుల చేపలవేటపై నిషేధం విధిస్తోంది. గతంలో నెలరోజులే ఉండే ఈ నిషేధాన్ని క్రమంగా పెంచారు. ప్రస్తుతం 61 రోజుల పాటు ఉంటోంది. ఈ నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని జగన్‌ ప్రభుత్వంరూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వారికే భృతి ఇస్తామని.. ఈ పథకం కింద లబ్ధి పొందే మత్స్యకారులు ఇతర ఉద్యోగాలేమీ చేయకూడదని, వారికి ప్రభుత్వం నుంచి మరే పథకం కింద లబ్ధి అందకూడదని ఆంక్షలు పెట్టారు. బడ్జెట్లో కేటాయింపులు చేసే సమయంలో 98,000 మంది మత్స్యకారులనే పరిగణనలోకి తీసుకుని వారికి సరిపడా రూ.100 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత మత్స్యశాఖ రూపొందించిన జాబితాలో కొత్తగా 36,000 మంది వచ్చి చేరారు. దీంతో బడ్జెట్‌ కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఈ పథకానికి అదనంగా రూ.34 కోట్లు కేటాయించాలని కోరుతూ మత్స్యశాఖ ఆర్థిక శాఖకు పైలు పంపింది. దీనిపై ఆర్థిక శాఖ పై షరతులు విధించి, ఆ ఫైలును తిప్పి పంపింది. ఇప్పుడేం చేయాలో మత్స్యశాఖకు పాలుపోవడం లేదు.
మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు
మత్స్యకారులకు జగన్‌ ఎన్ని వరాలిచ్చినా వారు విశ్వసించడం లేదని తేలిపోయింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని కాట్రావులపల్లి మత్స్యకార సొసైటీ ఎన్నిక జరిగింది. మొత్తం 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. నిజానికి... ఇది పార్టీ గుర్తుతో జరిగే ఎన్నిక కాదు. అయినప్పటికీ... వైసీపీ, టీడీపీ నేతలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆ పార్టీల మద్దతుదారులే రంగంలోకి దిగారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో సీక్రెట్‌ ఓటింగ్‌ నిర్వహించారు. టీడీపీ మద్దతుదారులు ఆరు స్థానాలు దక్కించుకున్నారు. వైసీపీ మద్దతుదారులకు రెండు మాత్రమే దక్కాయి. మరో డైరెక్టర్‌ స్థానం ఫలితం టై అయింది. బొమ్మా బొరుసు వేస్తే అదీ టీడీపీ మద్దతుదారే గెలుచుకున్నారు. అంటే 9 డైరెక్టర్‌ స్థానాల్లో టీడీపీకి ఏడు వచ్చాయన్న మాట. జగన్‌ ప్రభుత్వంపై విశ్వసనీయతకు ఇదే నిదర్శనం.