ఇదెక్కడి గోల జగ్గారెడ్డి! ఇంతకీ నీ టార్గెట్ ఎవరు?

July 15, 2019

కేసీఆర్ అంటే చాలు విరుచుకుపడే జగ్గారెడ్డి.. ఎందుకో తెలియదు గానీ గడిచిన కొద్ది రోజులుగా హరీశ్ రావును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే.. జగ్గారెడ్డి విమర్శలకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ కౌంటర్ ఇవ్వకపోవటం, తనపై చేస్తున్న విమర్శల విషయంలో హరీశ్ మౌనంగా ఉండటం ఒక ఎత్తు అయితే కేసీఆర్ పట్ల పాజిటివ్ గా, హరీశ్ పట్ల కఠినంగా మాట్లాడుతుండటం చూసి జనం ఇదెక్కడి గోలరా బాబు! అనుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే జగ్గారెడ్డి తీరు వెనుక అసలు కథ వేరే ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ తో యుద్ధం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, రాబోయే మరో పదేళ్ల వరకూ కేసీఆర్ దే తెలంగాణ అన్న విషయంపై జగ్గారెడ్డి క్లారిటీ తెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు జనం. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లు ఆయనకు వీర విధేయుడిగా మారితే రానున్న పదేళ్లలో రాజ్యం ఏలొచ్చన్న ఆలోచనలో జగ్గా ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

కేసీఆర్ కంట్లో పడేందుకు.. ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా హరీశ్ మీద గళం విప్పుతున్నారని చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా హరీశ్ ను కేసీఆర్ పక్కన పెట్టటం.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటివ్వకపోవటం హాట్ టాపిక్ గా మారింది. అందరూ హరీశ్ విషయంపై జాలిని ప్రదర్శిస్తూ.. అయ్యో! హరీశ్ కు ఎంత పని జరిగిందంటూ కేసీఆర్ తీరును లోగుట్టుగా తప్పు పడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఓపెన్ గా కేసీఆర్ కు తన మద్దతును ఇవ్వటంతో పాటు.. హరీశ్  తప్పుల్ని ఎత్తి చూపేలా.. హరీశ్ సుద్ద పూస కాదు సుమా అన్న భావన కలిగేలా కొన్ని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ తరహాలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. మంజీర, సింగూరు నీటి విషయంలో హరీశ్ తప్పు చేశారని, వాటిని ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హరీశ్ తప్పు చేశారు కాబట్టే.. తాను విమర్శ చేసినా ఆయన స్పందించటం లేదన్నారు. జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలా?  వద్దా? అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టమని చెప్పిన జగ్గారెడ్డి. తాను సీఎంను కలవనని చెప్పారు. తాను చెప్పాలనుకున్న విషయాల్ని మీడియాతోనే చెబుతానన్న ఆయన మాటలు చూస్తుంటే.. కేసీఆర్ మనసు దోచుకునేలా.. ఆయనకు నచ్చినట్లు మాట్లాడటంపై జగ్గారెడ్డి మస్తు కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో జగ్గారెడ్డి మాట తీరు ఇలా ఎందుకు మారిందనే కోణంలో జనాల్లో చర్చలు మొదలయ్యాయి.<