జగ్గారెడ్డి కామెంట్స్ లో కిక్ ఉంది

July 12, 2020

జగ్గారెడ్డి... ఒకప్పుడు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత. కానీ ఇపుడు జస్ట్ కాంగ్రెస్ నేత. కేసీఆర్ రెండోసారి గెలిచాక పార్టీ మారలేదు గాని ఆల్మోస్ట్ సరెండర్ అయ్యారు. నియోజకవర్గం కోసం అంటూ కేసీఆర్ ను పొగడానికి కూడా వెనుకాడలేదు. ఇదిలా ఉంటే... ఈ మధ్య ఆచితూచి ఆలోచించి కామెంట్లు చేస్తున్నారని అనిపిస్తుంది. తాజాగా హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలపై జగ్గారెడ్డి ఆలస్యంగా స్పందించారు. కానీ జగ్గారెడ్డి కామంట్లో కిక్ ఉంది. నిజమూ ఉంది.

’’హుజూర్ నగర్ లో పద్మావతి గెలిచి ఉంటే.. రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడు. ఓడిపోయారు కాబట్టి ఉత్తమ్ హీరో అయ్యారు. ఉత్తమ్ అదైర్యవంతుడు ఏమీ కాదు. యుద్ధ విమానాలు నడిపిన వ్యక్తి. గెలుపోటములు ఆయనకు సమానమే. ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయి. వైఎస్ హయాంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడింది. ఇపుడు టీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ గెలిచింది. ఇందులో వింత లేదు. ఉత్తమ్ కు గాని, ఉత్తమ్ పదవికి గాని వచ్చిన నష్టం ఏమీ లేదు‘‘ అని వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి.

ఉత్తమ్ భార్య గెలిస్తే... రేవంత్ హీరో ఎందుకు అవుతారని తల పట్టుకోనక్కర్లేదు. జగ్గారెడ్డి సరిగ్గానే విశ్లేషించారు. ఎన్నిక ముందు రేవంత్ రెడ్డి ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవడం, ఆ తర్వాత హుజూర్ నగర్ వెళ్లి ప్రచారం చేయడం... అక్కడ జనాలలో రేవంత్ కి మంచి స్పందన కనిపించడం... వంటి కారణాల వల్లే రేవంత్ తన భుజాల మీద వేసుకుని నడిపించాడన్న ప్రచారం జరిగింది. ఉత్తమ్ అసెంబ్లీ ఎన్నికల్లో భార్యను గెలిపించుకోలేకపోయాడు. ఇపుడు రేవంత్ సాయం తీసుకుని గెలిపించుకోగలిగాడు అన్న కోణంలో ప్రచారం జరిగింది. ఒకవేళ గెలిచి ఉంటే... అది ఉత్తమ్ కు ఇబ్బందిగా ఉండేది. కానీ పద్మావతి ఓడి భర్తను గెలిపించిదన్నది జగ్గారెడ్డి అంతర్యం. రేవంత్ ను ఈ ఫలితం పునరాలోచనలో పడేసింది. దానిని జగ్గారెడ్డి సరిగ్గా విశ్లేషించారు.