టైగ‌ర్ జ‌గ్గారెడ్డి షాకింగ్ డెసిష‌న్‌..!

July 11, 2020

త‌న‌కు పీసీసీ ప‌ద‌వి అప్పగిస్తే కాంగ్రెస్ కు పున‌ర్వైభ‌వం తీసుకొస్తాన‌ని,  పార్టీని తెలంగాణ‌లో అధికా రంలోకి తీసుకువ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ పీసీసీ రేస్‌లో ఉన్నాన‌ని తన మనసులోని మాటను బయట పెట్టిన జగ్గారెడ్డి మ‌రో అడుగు ముందుకేశారు.  తనకు పీసీసీ పదవిని అప్పగిస్తే ఎలాంటి రాజ్యంగపరమైన పదవులు లేకుండా పని చేస్తానని హమీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కావడంతో కాంగ్రెస్ పార్టీకి  కొత్త నాయకత్వం అవ‌స‌ర‌మ‌ని అధిష్ఠానం భావిస్తోంది. ఆ ఎన్నిక‌ల్లో పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకున్న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి త‌న భార్య‌ను కూడా గెలిపించుకోలేక‌పోయారు. రాష్ట్రంలో బ‌లంగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కునేందుకు గట్టి నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం యోచిస్తోంది.

ఈక్ర‌మంలోనే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని మారుస్తామంటూ పార్టీ హైకమాండ్ సంకేతాలను పంపింది. దీంతో ఈ ప‌ద‌విపై ఎప్పటి నుంచో క‌న్నేసిన ఆశావహులు ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో పీసీసీ పగ్గాలను చేపట్టేందుకు ఆ పార్టీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం పోటిపడుతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు.
తాను సైతం పోటీలో ఉన్నట్టు రెండు రోజుల క్రితమే ఆయన ప్రకటించారు. పీసీసీ అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని హైకమాండ్‌కు విజ్ఝప్తి చేశారు. ఢిల్లీ నేతలకు ధరఖాస్తు కూడా పెట్టుకున్నట్టు చెప్పారు. ఢిల్లీలో జరగనున్న పార్టీ సమావేశానికి తన బయోడేటాను కూడా జ‌గ్గారెడ్డి పంపారు.
అయితే కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనంతరమే పీసీసీ నేత ఎంపిక‌కు  శ్రీకారం చుట్టే అవకాశం ఉండడడంతో... ఇప్పటి నుండే ఆ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అయితే రానున్న అయిదు సంవత్సరాల పాటు పార్టీని నడిపించే ధీటైన నాయకుని ఎన్నిక కోసం పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే అధికార పార్టీని తీవ్రంగా విమర్శించే నేతలకు ఎక్కువగా అవకాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.