డా. సుధాకర్ యు టర్న్ - జగన్ దేవుడు, వైఎస్ సూపర్

August 13, 2020

నర్సీపట్నం మత్తుడాక్టర్ సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక వెర్షనులో ఉన్న డాక్టర్ సుధాకర్ డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లాక కొద్దిరోజులు కనపడలేదు. తాజాగా ఆయన తన కార్డుల కోసం పోలీసు స్టేషనుకు వచ్చిన సందర్భంగా అందరినీ విస్మయపరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ అంటే నాకు ఇష్టం. జగన్ దేవుడు. చంద్రబాబు కూడా బాగా పాలించారు. నేను ఎవరి రాజకీయ ప్రయోజనాలకోసం పనిచేయలేదు. నాకు రాజకీయాలంటే అసహ్యం. నా ఉద్యోగం నాకు ఇప్పిస్తే ప్రశాంతంగా పనిచేసుకుంటాను. ఉద్యోగం లేక డబ్బులకు ఇబ్బంది గా ఉంది. పేదలకు సేవ చేయడానికే గవర్నమెంటు ఉద్యోగంలో చేరాను అని సుధాకర్ సరికొత్తగా మాట్లాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన యుటర్న్ తీసుకున్నాడు. 

అరెస్టు చేసిన రోజు, అంతకు ముందు, ఆస్పత్రిలో ఉన్నపుడు జగన్ ను తన ఇష్టానుసారం తిట్టిన సుధాకర్ ఇపుడు ఏకంగా జగన్ దేవుడు అంటున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ తల్లి అతను ఆస్పత్రిలో ఉన్నపుడు చేసిన కామెంట్లు గుర్తుచేసుకోవాలి.

‘‘మీ కొడుకు ఉద్యోగం తిరిగి ఇిస్తాం...కేసులు వెనక్కు తీసుకోండని బెదిరిస్తున్నారు. కానీ అలా చేస్తే మాకు అండగా ఉన్న వారిని అవమానించినట్టు అవుతుంది. అందుకే మేము ముందుకే పోతాం‘‘ అని సుధాకర్ తల్లి అన్నారు.

ఇపుడు సుధాకర్ మాట మార్చడం వెనుక ఎవరున్నారో లేదా ఏ బలమైన కారణం ఉందన్నది అర్థం కాని పరిస్తితి. ఒకవైపు జగన్ దేవుడు అంటూ మరోవైపు ఆస్పత్రిలో ఉండగా నన్ను చంపుతామని బెదిరించారు. మా కుటుంబం చాలా భయపడిందన్నారు సుధాకర్. పైగా తాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పినా సుమోటోగా కేసు వేశారని అన్నారు. 

మెంటల్ ఆస్పత్రిలో ఇచ్చిన మత్తు వల్ల నాకు స్పృహ లేదు. సీబీఐ వాళ్లు ఏం అడిగారో, నేను ఏం చెప్పానో నాకు అర్థం కావడం లేదన్నారు. నా పేరు మీద ఉన్న కేసులన్నీ విత్ డ్రా చేసుకుంటాను. నా ఉద్యోగం నాకు ఇస్తే చాలు. పనిచేసుకుని బతుకుతాను అని సుధాకర్ చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.