సుప్రీం కూడా నో అంది.. తంబికి జైలే

July 13, 2020

పవర్ చేతిలో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే. వ్యవస్థల్ని కంట్రోల్ చేసే అవకాశం వచ్చినప్పుడు.. దాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం మాని.. కాసుల పేరాశలో మునిగిపోతే ఎలాంటి తిప్పలు ఎదురవుతాయో.. తాజాగా ఒక సీనియర్ కాంగ్రెస్ నేతకు ఎదురవుతున్న పరిస్థితి చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.

మాజీ కేంద్రమంత్రి చిదంబరం రేంజ్ ఏమిటి? యూపీఏ1.. 2లలో ఆయన మాటే శాసనంగా ఉండేది. అధికారం ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసేది. అలాంటివేళ.. తన వ్యక్తిగత ఇమేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేయాల్సిన చిదంబరం.. అందుకు భిన్నంగా పలు కక్కుర్తి డీల్స్ లో చిక్కుకొని ఇప్పుడు కేసులో ఉచ్చులో ఇరుక్కుపోయారు. గతంలో మాదిరి పరిస్థితి ఇప్పుడు లేదు.
పవర్ పోయినంతనే.. అధికారంలోకి వచ్చిన వారు.. గత ప్రభుత్వంలోని లోటుపాట్లను తవ్వేసి.. అందులోని కీలక నేతల్ని టార్గెట్ చేసి.. వారికిక రాజకీయ భవిష్యత్తు లేని రీతిలో ఫిక్స్ చేస్తున్న పరిస్థితి. నిజానికి ఇలాంటి వ్యూహాలు చిదంబరం మాష్టారికి తెలియనివి కావు. ఆ మాటకు వస్తే.. ఇలాంటి వాటిని స్టార్ట్ చేసినోళ్లలో చిదంబరం ఒకరు. తానేం చేశానో.. తన తర్వాత వచ్చినోళ్లు సైతం తనను ఫాలో అవుతారన్న విషయాన్ని ఎందుకు మిస్ అయ్యారో కానీ.. ఆయన పేరు పలు కుంభకోణాలతో లింకు చేయటం తెలిసిందే.
దీనికి సంబంధించి ఆరోపణలే కాదు.. ఆధారాలు కూడా లభించటంతో చిదంబరం తంబి పీకకు చట్టంలోని సెక్షన్లు ఒక్కొక్కటిగా చిక్కుకుంటున్నాయి. అలాంటిదే ఐఎన్ ఎక్స్ మీడియా కుంభకోణం. ఈ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఒక నిందితుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. ఈ స్కాం విషయంలో దొరికిపోయారన్న వాదన అంతకంతకూ బలపడుతోంది. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన వేళ.. ఆయన కనిపించకుండా పోయారన్న వార్తలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఇలాంటివేళ.. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన తాజా పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా.. తాజాగా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నారు చిదంబరం. కోర్టు ఆదేశాలు ఒకపక్క.. మరోవైపు చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం చూస్తుంటే.. ఆయన అరెస్ట్ ఖాయమన్న భావన కలుగక మానదు.