ఆయ‌న ఇపుడు కాంగ్రెస్‌ను చంపేసే ప‌నిలో ఉన్నార‌ట‌

May 25, 2020

ఫైర్‌బ్రాండ్ రాజ‌కీయ నాయ‌కురాలిగా పేరున్న సీనియ‌ర్ నేత డీకే అరుణ ఊహించ‌ని రీతిలోకాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. హ‌ఠాత్తుగా జ‌రిగిన ఈ ఎపిసోడ్‌తో కాంగ్రెస్ వ‌ర్గాలు షాక్ తిన్నాయి. అస‌లెందుకు అరుణ పార్టీకి గుడ్‌బై చెప్పారని చ‌ర్చించుకున్నారు. మ‌రోవైపు బీజేపీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో అరుణ ఇమ‌డ‌గ‌లారా అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా, వీట‌న్నింటికీ అరుణ స‌మాధానం ఇచ్చారు.
పార్టీని వీడిన అనంత‌రం తాజాగా అరుణ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌లో చేరమని ఆఫర్‌ వచ్చిందని.. కానీ ఆ పార్టీపై పోరాడిన తాను మళ్లీ అందులో ఎలా చేరుతానని ప్రశ్నించారు. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి త‌న‌పై క‌క్ష‌ క‌ట్టార‌ని అరుణ‌ ఆరోపించారు. తాను పీసీసీ చీఫ్‌ రేస్‌లో ఉన్నందునే తనపై ఉత్తమ్‌ కక్ష కట్టారని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. 'జైపాల్ రెడ్డి జనతాదళ్‌ను బొంద పెట్టారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను బొంద పెట్టే పనిలో పడ్డారు' అని ఆరోపించారు. జైపాల్ రెడ్డి ఒక మేధావి అని.. ఆయన సలహాలతో ఉత్తమ్ పనిచేస్తారని అన్నారు. జిల్లాలో తనకు వ్యతిరేకంగా వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డిలతో ఉత్తమ్‌ ఒక గ్రూప్ తయారు చేశారని.. వారితో తనకు వ్యతిరేకంగా మాట్లాడించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఇంటికి ఉత్తమ్‌ వెళ్లారని.. కానీ పార్టీ మారొద్దని చెప్పలేదని అరుణ వివరించారు.
కాంగ్రెస్‌ బలహీనపడడానికి, నేతలు పార్టీలు మారడానికి జైపాల్ రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కారణమ‌ని అరుణ బీజేపీ అంత‌ర్గ‌త రాజ‌కీయాల గురించి అరుణ స్పందిస్తూ, కాంగ్రెస్‌లో ఎన్నో గ్రూప్‌ల మధ్య పని చేసిన తనకు బీజేపీలో కొనసాగడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. పార్టీలో కాంగ్రెస్ ఇచ్చిన గౌరవం కంటే ఎక్కువ గౌరవాన్ని ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారన్న అరుణ.. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు.చాలా మంది కాంగ్రెస్ నేతలు తనకు ఫోన్ చేసి మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పారని తెలిపారు.