రాష్ట్రాన్ని విభజించిన జైరాం రాజధాని గురించి ఏమన్నాడు?

February 28, 2020

ఏపీలో రాజధాని అంశం తప్ప మరేదీ చర్చలో లేదు. అన్ని సమస్యలు గాలికిపోయాయి. అన్ని పార్టీలు, అందరు నేతలు ఏపీ రాజధాని గురించే స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత, ఏపీ విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ మూడు రాజధానులపై స్పందించారు. 

మూడు రాజధానులు అన్నది సాధ్యమయ్యే పని కాదని, ఇప్పటికే మద్రాసు నుంచి విడిపోయినపుడు ఆ మోడల్ విఫలమైందని, హైకోర్టును విడగొట్టడం కూడా సాధ్యం కాలేదని జైరాం గుర్తుచేశారు. అయితే, ఈ అంశంపై ప్రస్తుతం కాంగ్రెస్ సైలెంట్ గా ఉందని... రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తర్వాత దీనిప కాంగ్రెస్ అధికారికంగా స్పందిస్తుందని జైరాం వ్యాఖ్యానించారు. 

శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏపీకి మధ్యలో రాజధానిని సూచించిన విషయం గమనించాలన్నారు. అమరావతి రాజధానికి సరైన ప్రాంతమే అని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, సచివాలయాలు, హైకోర్టు వేర్వేరు చోట్ల ఉండటం సాధ్యమయ్యే పని కాదని అన్నారు. 

అయితే, కాంగ్రెస్ తీరు అభ్యంతరకరంగా ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికే అనేక చారిత్రక తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత స్పందిస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ అమరావతి తరలింపునకే సిద్ధమయ్యారు. విశాఖలో భవనాలు వెతుకుతున్నారు. అన్ని పార్టీలు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నాయి. ఏపీలో టికానా లేని ఈ పార్టీ స్పందన కోసం ఎవరూ ఎదురుచూడటం లేదు. అప్పట్లో విభజన సమయంలో జైరాం వంటి వారి అహంకారం, అజ్జానం వల్ల ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు కూడా సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల పార్టీ తనకు తాను శాశ్వతంగా సమాధి కట్టుకుంటోంది.