వరల్డ్ రికార్డ్ హోల్డర్ నే మెప్పించిన సినిమా

July 04, 2020

రెండు వారాల కిందట విడుదలైన ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ ప్రపంచవ్యాప్తంగా ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. కేవలం మూడు రోజుల తొలి వీకెండ్లో ఈ సినిమా ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. అంటే అక్షరాలా 8400 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నమాట. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా ఈ సినిమా మంచి వసూళ్లతో సాగిపోతోంది. ఆల్రెడీ వరల్డ్ వైడ్ కలెక్షన్లు 2 బిలియన్ డాలర్ల మార్కును దాటేశాయి. ఇండియాలో ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది కూడా. ఫుల్ రన్లో ‘అవతార్’ కలెక్షన్ల రికార్డుల్ని కూడా దాటేసి 3 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా చరిత్ర సృష్టిస్తుందన్న అంచనాలున్నాయి. ఈ సినిమాకు ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కూడా లభించాయి. ఆయన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ను పొగిడేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘ఎవెంజర్స్’ సినిమా తన ‘టైటానిక్’ను ముంచేస్తున్నట్లుగా ఒక పిక్ పెట్టిన కామెరూన్.. ‘‘కెవిన్‌ ఫీజ్‌ (మార్వెల్‌ సంస్థ అధినేత, నిర్మాత).. నిజమైన టైటానిక్‌ ఓడను ఓ ఐస్‌ బర్గ్ ముంచేసింది. కానీ నా ‘టైటానిక్‌’ను మీ ‘అవెంజర్స్‌’ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్‌స్ టార్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని సిబ్బంది మీ విజయానికి సెల్యూట్‌ చేస్తున్నారు. సినీ పరిశ్రమ ఇంకా సజీవంగా ఉంది. చాలా బాగుంది అనే కాదు.. అంతకంటే గొప్పగా ఉంది అని మీరు నిరూపించారు’’ అని కామెంట్ చేశాడు. కామెరూన్ డైరెక్ట్ చేసిన ‘టైటానిక్’ అప్పట్లో అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేయగా.. తర్వాత ఆయన తీసిన ‘అవతార్’ మళ్లీ కొత్త రికార్డులు నెలకొల్పింది.