గన్ తీశాడు... టపటపా కాల్చాడు ... ఈ కల్చర్ మనకొద్దు

August 14, 2020

ఇండియాలో చొరబాట్లు నిజం. వాటిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసింది నిజం. అయితే... వాటి జోలికి పోవడం అంటే ఆర్థిక పరిస్థితిని కెలకడం అనే కోణంలో గత ప్రభుత్వాలు ఇగ్నోర్ చేశాయి. అయితే... సుదీర్ఘ కాలపు సమస్య అయిన జమ్ము కశ్మీర్ ను కెలికిన మోడీ... ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసి సరిహద్దుల్లోనే చొరబాట్లను అణచివేయడానికి కఠిన చట్టం తెచ్చారు. సీఏఏ పేరిట భారత పౌరసత్వ చట్టానికి సవరణలు తెచ్చారు. ఎన్నార్సీ పేరిట... జాతీయ జనగణనకు అదనంగా మరింత సమాచారం సేకరించాలని నిర్ణయించారు. దీని ఉద్దేశం ఎవరైనా దురుద్దేశంతో ఇక్కడ అక్రమంగా నివసిస్తుంటే పంపించేద్దామని... అయితే... ఈ అవకాశాన్ని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించింది. బీజేపీలో కూడా వరుస సంచలన నిర్ణయాల మధ్య దీనిని తలకెత్తుకోవడం, కొందరు బీజేపీ లీడర్లు నోటికొచ్చినట్లు మాట్లాడటంతో దీని చుట్టు వివాదాలు ముసురుకున్నాయి.

కొన్ని రోజులుగా దేశంలో ఈ రెండు చట్టాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. అనుకూలంగా కూడా కూడా అవగాహన సదస్సులు, ర్యాలీలు చేస్తున్నారు. అయితే... మోడీ హిందుత్వ వాది కాబట్టి... హిందు పేరుతో ఏం చేసినా చెల్లుతుందని భావించిన ఓ మతోన్మాది నిరసన తెలుపుతున్న వ్యక్తులపై ఢిల్లీలో ఈరోజు కాల్పులు జరపడం కలకలం రేపింది. కాల్పులు జరిపిన నేరం కంటే కూడా... తనకు నచ్చలేదన్న అక్కసుతో ఇండియాలో కూడా ఇలా చేయొచ్చన్న సంప్రదాయం మొదలుకావడం ప్రమాదకరం. 

ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నారు. ఆ విద్యార్థుల్లో కొందరు ఇతరులు కూడా కలిశారు. మరి ఎంత కాలం నుంచి దీనిని గమనిస్తున్నాడో ఫ్రస్ట్రేట్ అయిన రామ్ భక్త్ గోపాల్ అనే యవకుడు ఓ తుపాకితో వారిపై కాల్పులు జరిపాడు. మీకు స్వాతంత్ర్యం కావాలా తీసుకోండి అంటూ కాల్పులు జరపడంతో వారంతా భయబ్రాంతులకు లోనయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడే ఉన్నా కూడా వెంటనే అతన్ని అదుపు చేయలేదని... అందరూ ఢిల్లీ పోలీసులను విమర్శిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం లేదు. ఒకరికిద్దరికి గాయాలయ్యాయి. భారతదేశపు సంక్షేమం కోసం, ఈ దేశాన్ని మరింతగా అభివృద్ధి చెందడం కోసం ఏం చేసినా పర్లేదు గాని...ఈ మతోన్మాదాన్ని అది ఏ మతంలో అయినా ప్రజల్లో అరికట్టకపోతే ప్రమాదం. దేశానికి తీరని నష్టం అవుతుంది.