జనసేన.. మీ పరిస్థితి ప్రశ్నార్థకమేనా..?

December 06, 2019

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడటంతో గెలుపు గుర్రాలను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి రాజకీయ పార్టీలు. ప్రధానంగా టీడీపీ, వైసీపీలు దూకుడుగా వ్యవహరిస్తూ ఈ ఎన్నికలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. అయితే జనసైనికుడిగా సమాజంలోని అవినీతిని అంతమొందిస్తానని జనం ముందుకొచ్చిన పవన్ మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నారు. రాష్ట్రంలో జనసేన ఉనికి ఏ మాత్రం కనిపించడంలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆ పార్టీలో ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ ఎన్నికల్లో పవన్ పోటీచేస్తారా? లేదా? షరామామూలుగా ఏదైనా పార్టీకి మద్దతిస్తారా? ఒకవేళ ఇస్తే తీసుకునే పొజిషన్ లో వైసీపీ,టీడీపీ పార్టీలు సుముఖంగా ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గతంలో టీడీపీతో కలిసి మరోసారి పొత్తు పెట్టుకొని జనసేన బరిలోకి దిగుతుందని వార్తలొచ్చాయి. పవన్ కు 4 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లను చంద్రబాబు ఇవ్వనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇంకో మరి బాబిచ్చిన ఆ ఆఫర్ పవన్ తిరస్కరించారని తెలిసింది. ఇక ఆ తర్వాత  వైసీపీ నేతలు కూడా సంప్రదించారని కానీ వైసీపీతో చెలిమికి ఆదిలోనే చెడిందని తెలిసింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు, జగన్ ఇద్దరూ  కూడా పవన్ ని ఏ మాత్రం లెక్కచేయకపోవడంతో వారిపై విమర్శలకు దిగితున్నారు పవన్.  సో ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పవన్ పొత్తు కోసం వెంపర్లాడినా కూడా అటు టీడీపీ గానీ ఇటు వైసీపీ గానీ జనసేనను పట్టించుకునే పరిస్థితిలో లేవని ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. దీంతో జనసేన పార్టీకి పొత్తు లేదని క్లియర్ అయినట్లే.

మరోవైపు ఇంతవరకూ జనసేన ఊపు కనిపించకపోవడంతో.. ఇప్పుడు ‘పవన్.. ఎన్నికల దారెటు’ అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. అయితే టీడీపీ లేదా వైసీపీతో పొత్తు పెట్టుకొని ఈసారి పోటీచేస్తే కనీసం 10 నుంచి 20 సీట్లు అయినా గెలుచుకునేదని, ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగితే జనసేన ఉనికే ప్రశ్నార్థకం కావచ్చని రాజకీయ విశ్లేషకులతో పాటు స్వయంగా జనసైనికులు అభిప్రాయపడుతుండటం గమనించదగిన విషయం. చూడాలి మరి చివరకు పవన్.. ఎలా గమ్యం చేరుతాడో!