రాపాక లోగుట్టు తెలిసిపోయింది...

February 24, 2020

పార్టీ సిద్ధాంతాలను పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు పుణికిపుచ్చుకోవాలి. ఒకవేళ పార్టీయే తప్పుడు మార్గంలో నడుస్తుంటే.. అపుడు నిజాయితీగా స్వరం వినిపించడంలో తప్పులేదు. తాజాగా జనసేన పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యే... పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాటకీ మాటకీ సంబంధం లేకుండా వ్యాఖ్యలు చేసి అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నారు. పార్టీ నుంచి పోవాలన్న ఆలోచన వాళ్లు మాత్రమే ఇలా డైలమా సృష్టిస్తారు. జనసేన అధినేత వంద శాతం జగన్ ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాను ఎమ్మెల్యే ఉన్నా ఏం బావుకోలేనని అర్థం చేసుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కొద్ది రోజులుగా ఆయన వ్యవహారం తన దారి తాను చూసుకోవడం మంచిదని డిసైడనట్లే ఉంది. తాజా వ్యాఖ్యలు.. దానిని మరోసారి కన్ ఫం చేశాయి.

ఈరోజు రాపాక మాటలు వింటే ఎవరికైనా అతను ఎగిరిపోయే పక్షి అని అర్థమవుతుంది. ‘‘జనసేనలో కొన్ని మార్పులు జరగాల్సి ఉంది. కొన్ని సరయిన నిర్ణయాలను తీసుకోకపోతే పార్టీ ముందుకు సాగదు. నా భవిష్యత్తు గురించి కూడా నేను ఆలోచించుకోవాలి’’ అన్నారు. అంటే జనసేనలో ఉంటే నాకేం ప్రయోజనం వైకాపాకి వెళ్తే ఎన్నో లాభాలు అన్నట్లుంది రాపాక వెర్షను. పోనీ ఈ మాటకు అయినా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు.

వైసీపీతో నాకు సంబంధాలున్నాయనే ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అసెంబ్లీలో మైకు దొరకదని మరో విరుద్ధమైన వ్యాఖ్య చేశారు. మైకు అనేది ఎమ్మెల్యే హక్కు. అది ఎలాగైనా దొరుకుతుంది. దొరక్కపోతే బయటకు వచ్చి తాను చెప్పాలనుకున్నది మీడియాకు చెప్పొచ్చు. ఇంకా ఎక్కువమందే చూస్తారు. అంతేగాని మైకు కోసం ప్రభుత్వం ఏం చేసినా రైట్ అని చెప్పకూడదు కదా? !!

వాస్తవానికి పవన్ కళ్యాణ్ భాష విషయంలో సరిగ్గానే ఉన్నారు. మనది తెలుగు రాష్ట్రం. ఇక్కడ ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియం, ఒడియా మీడియం, బెంగాల్ మీడియం, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నడుపుతూ కేవలం తెలుగు మీడియం పాఠశాలలు మాత్రమే నడపకపోతే అంతకంటే ఘోరమైన తప్పు ఏముంటుంది అనేది పవన్ ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం అందించడంలో తప్పులేదు. కానీ తెలుగు మీడియం చదవాలనుకున్న వారికి ఆ అవకాశం ఇవ్వకపోవడం మాత్రం నిజంగా తప్పే. పరాయి భాష అవసరమే గాని అదే జీవితం కాకూడదు కదా. జనసేన చెబుతున్న ఈ వాదనలో ఏం మార్చుకోవాలో రాపాక చెప్పాలి. తాను పార్టీ మారాలనుకుంటే మారొచ్చు గాని... తన స్వార్థం కోసం తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా చిత్రీకరించడం పార్టీకి మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి  ప్రమాదం. రాపాక త్వరగా సరయిన నిర్ణయం తీసుకోవడం మంచిది.