జగన్ పై పవన్ వేయబోతున్న మరో బాంబు

February 24, 2020

ముల్లును ముల్లుతోనే తీయాలి. ఇది ఒక సామెత. ఎందుకో జగన్ పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలు పోరాటాలు చూస్తే... ఒకేలా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వ్యూహరహితంగా కనిపించిన పవన్ ... రకరకాల నిరసనలు, ర్యాలీలు, ప్రణాళికలతో ఎమ్మెల్యేలు వెంట లేకపోయినా ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. పవన్ నిరసనలు, మాటలపై స్పందించకుండా జగన్ ఊరికే ఉండలేకపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబు కంటే కూడా పవన్ మాటలపై జగన్ ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది, ఎక్కువ మాట్లాడాల్సి వస్తోంది. తాజాగా పవన్ మరో నిరసనతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. 

భారతదేశపు అన్నపూర్ణగా వెలుగొందుతున్న కృష్ణా, గోదావరి డెల్టా రైతుల కష్టాలను వెలుగులోకి తీసుకురావడానికి పవన్ సంకల్పించారు. వారి పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పోరాటానికి రైతు సౌభాగ్య దీక్ష అంటూ పేరు పెట్టింది జనసేన పార్టీ. మన రాష్ట్రంలో 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఏటా పండుతుండగా, అందులో 25 లక్షల క్వింటాళ్లు ఉభయగోదావరి జిల్లాల్లోనే పండుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎంత కష్టపడి రైతులు వ్యవసాయం చేసినా, పంటలు పండించినా గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, ఖర్చులు సైతం రాబట్టుకోలేకపోతున్నారని... వరి సాగు చేసి అన్నం పెట్టిన రైతులు అప్పుల పాలవుతున్నారని పవన్ చెప్పారు. 

ధాన్యం రైతులు తనను కలిసి వారి కష్టాల గురించి చెప్పారని... వీరిలో ఇంత వేదన ఉందా అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ప్లాన్ చేసినట్టు పవన్ వివరించారు. గత ఆదివారం మండపేట ప్రాంతాలలో రైతులతో మాట్లాడాను. వారి మాటలు విన్న తర్వాత చాలా బాధ కలిగింది, వారి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి  ఈ నెల 12 తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్షకు సంకల్పించాను అని పవన్ వెల్లడించారు. పవన్ చాలా వ్యూహాత్మకంగా... ప్రజల్లో నిలుస్తున్నాడు. నిత్యం మీడియాలో కనిపిస్తూ కీలకమైన వర్గాలకు దగ్గరవుతున్నాడు.