జనసేన ఆఫీసు.. బార్ అండ్ రెస్టారెంట్ అయ్యింది

July 05, 2020

పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎంతగా కండలు చూపాలనుకుంటున్నా జనసేన బాడీ బిల్డింగ్ సాధ్యం కావడం లేదు. పైగా ఎన్నికల్లో ఓటమి తరువాత ఏదో పవన్ తన ఆత్మ సంతృప్తి కోసం అప్పుడప్పుడు అరకొరగా మిగిలిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా జగనసేన మనుగడ కష్టమన్న విషయం మాత్రం పదేపదే స్పష్టమైపోతోంది. తాజాగా... గుంటూరు జిల్లాలో ఆ పార్టీ కార్యాలయంలో బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వార్త ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.
గుంటూరు నగర శివారులో ఉన్న గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కార్యాలయం ఉంది. కానీ, ఇప్పుడది ఖాళీగా ఉంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ భవనాన్ని జనసేన నేతలు యజమానికి తిరిగి అప్పగించడంతో, అక్కడ టూలెట్ బోర్డు పెట్టారు. అయితే, అంతకుముందు జనసేన కోసం పెట్టుకున్న లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని యజమాని చెబుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఈ భవంతిలో జనసేన, తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎన్నికలకు ముందు రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత, ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత, రావెల ఈ ఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు కూడా. దీంతో కార్యాలయం అతీగతీ పట్టించుకునే వారు లేకపోయారు. కాగా, గుంటూరుతో పాటు పలు పట్టణాలు, నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు మరికొన్ని ఇప్పటికే ఖాళీ అయ్యాయి.