తెలంగాణలో పవన్ మార్కులు కొట్టేశాడు

April 01, 2020

అధికారంలో ఉన్న పార్టీ నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి కంటే...ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత తీరే బాగుంద‌నే చ‌ర్చ కొత్త‌గా తెర‌మీద‌కు వ‌చ్చింది. తాము స్ఫూర్తిగా తీసుకున్న నాయ‌కుడే త‌మ‌ను బాధించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. స‌ద‌రు నాయ‌కులు ఎవ‌రంటే..ఏపీ ముఖ్య‌మంత్రి  వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...ఇంత‌కీ ఎవ‌రు చ‌ర్చించుకుంటున్నారంటారా....తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికులు.
ప‌లు డిమాండ్ల‌ను పేర్కొంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మె 15వ రోజుకు చేరడంతో పాటుగా...నేడు రాష్ట్ర బంద్‌కు సైతం పిలుపునిచ్చింది. అధికార టీఆర్ఎస్‌ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన సహా అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటామని ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఓలా, ఉబర్ క్యాబ్‌లతోపాటు ప్రైవేట్ టాక్సీలు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ టాక్సీ డ్రైవర్ల జేఏసీ తెలిపింది. లెక్చరర్స్‌ జేఏసీ, జానపదకళాకారుల సంఘం కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి.
అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు తెలంగాణ‌లోని ఆర్టీసీ కార్మికుల‌ను ఆక‌ట్టుకొని...స‌మ్మెకు సిద్ధ‌మ‌య్యేలా చేశాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇలాంటి స‌మ‌యంలో...రాజ‌కీయాల రీత్యా...స‌మ్మెకు త‌న పార్టీ అయిన వైసీపీతో బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ....కార్మికుల డిమాండ్ల‌ను సానుకూలంగా ప‌రిశీలించాల‌ని అయినా..జ‌గ‌న్ సూచించ‌లేద‌ని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు.
మ‌రోవైపు, తెలంగాణ‌లో త‌క్కువ ఆద‌ర‌ణ ఉన్న జ‌న‌సేన పార్టీ త‌న స్టాండ్‌ను స్ప‌ష్టంగా తెలియ‌జేసింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో ప‌వ‌న్ త‌న‌ వైఖ‌రి వెల్ల‌డిస్తూ..తాను కార్మికుల ప‌క్ష‌మేన‌ని...వారిని రోడ్డున ప‌డేసే నిర్ణ‌యానికి మ‌ద్ద‌తిచ్చేది లేద‌ని తెల్చిచెప్పడాన్ని వారు హ‌ర్షిస్తున్నారు. అయితే, బంద్ జ‌రిగే శ‌నివారం రోజు న‌గ‌రంలో ఉన్న ప‌వ‌న్‌...ఏదైనా ఒక‌చోట కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా పాల్గొనాల్సింద‌ని అభిప్రాయప‌డుతున్నారు.