జనసేన రిపోర్ట్ -  ఉతికారేసిన పవన్ 

May 26, 2020

జగన్ వంద రోజుల పాలనపై జనసేన పక్కా ప్లాన్ తో నివేదిక తయారుచేసుకుని మరీ స్పందించింది. ప్రణాళిక బద్ధంగా విమర్శలకు దిగిన పవన్ అందరినీ ఆకర్షించారు. ఇక పవన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఒక్క మాటలో చెప్పాలంటే... వైసీపీ నేతలకు పాలన ఆకతాయి తనంగా ఉందని వ్యాఖ్యానించారు. మొత్తానికి అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం పాలనలో పుష్కలంగా కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

‘‘ఏమిటీ  పాలన. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? ఎవరి కోసం పాలన చేస్తున్నారో పాలకులకు అర్థమవుతుందా? ఏపీలో టెర్రర్ గవర్నమెంట్ నడుస్తోంది. ఇది ఇన్ఫోసిన్ మాజీ డైరెక్టర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత రామచంద్ర పాయ్ అన్నమాట. మా నివేదిక విశ్లేషించాక ఆ మాట జగన్ పాలనకు సరైనది అని భావిస్తున్నాను. పెట్టుబడిదారుల్లో ప్రభుత్వం భయం పుట్టిస్తోంది. 24 వేల కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన ఒక విదేశీ కంపెనీ తనప్రతిపాదన వెనక్కు తీసుకుందంటే... పాలన ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. ఇంత పెద్ద పెట్టుబడిదారులు వెళ్లిపోతే ఇక చిన్నపెట్టుబడిదారుల పరిస్థితి ఏంటి? అసలు పాలన ఎవరి ప్రయోనాల కోసం సాగుతోంది? రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం. పాలన శూన్యం. పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం.  పెట్టుబడిదారులు వెళ్లిపోతే... కొత్తవారు ఎవరూ రారు. 
పరిపాలనను ఒక ధర్మకర్తలా చేయాలి. కానీ ఒక వ్యాపారిలా పాలిస్తున్నారు. ఇది అనేక దుష్ఫరిణామాలకు దారితీస్తుంది. గ్రామ వాలంటీర్ల నియామకంలో పారదర్శకత లోపించింది. పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చినట్లుంది. ప్రభుత్వానికి అదొక సమాంతర వ్యవస్థలా మారింది. వీరు ఎన్నికల్లో వైసీపీ కొరియర్లుగా మారనున్నారు. వ్యవస్థలపై ముఖ్యమంత్రికి అవగాహన లేదు. పాలనపసై ఆసక్తి శ్రద్ధ లేదు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ అమెరికాలో ఉన్నారు. కనీసం ఒక్క పర్యవేక్షణ, సమీక్ష జరగలేదు. మంత్రులు వారి సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్ తెలియక పుష్కలంగా వచ్చిన నీళ్లను సముద్రంపాలు చేశారు. వరద ముంపును పట్టించుకోకుండా రాజకీయ మైలేజీ కోసం మంత్రులు చంద్రబాబు ఇంటి చూట్టూ తిరిగారు. ఇంత నిర్లక్ష్యం, ఆకతాయి తనమా? రాష్ట్రంలో ఇసుకే లేకుండా చేశారు. వందరోజుల్లో ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారా? యోగి ఆదిత్యనాథ్ కూడా కొత్తగా వచ్చారు. కానీ ఇంత అస్తవ్యస్తంగా అప్పట్లో పాలించలేదు. వందరోజుల్లో ఆయన మార్కు చూపించారు. ఇసుక మాఫియానే టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చింది. గుర్తుపెట్టుకోండి.’’ అంటూ పవన్ ఫైర్ తో విమర్శలు చేస్తూనే ఆదర్శవంత మైన పాలన అందించండి... అంటూ సూచించారు.

పోలవరంపై పవన్ సీరియస్ 

పోలవరం నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయంటున్నారు. బాధ్యత గల పాలకులు వాటిని సరిచేయాలి అంతే కానీ.. టెండర్లను రద్దు చేస్తానా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. బొత్స సత్యనారాయణ తన ఆస్తుల్ని అమ్మి పోలవరాన్ని పూర్తిచేస్తారా అంటూ పవన్ ఫైర్ అయ్యారు.

నాదెండ్ల విమర్శలు

ఇక జగన్ పాలనపై జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వంద రోజుల పాలన వైసీపీ వారి కోసమే సాగిందన్నారు. ఇష్టం వచ్చినట్లుగా జీవోలు ఇచ్చారని ఆరోపించారు. ఎటువంటి లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా మౌఖిక ఆదేశాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేశారని నాదెండ్ల విమర్శించారు. రెండు లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అర్ధంతరంగా ఆపేశారు. విద్యలో మరింత సదుపాయాలు కల్పించడం అంటే భోజనాలు మానేయడమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి అయోగ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని నాదెండ్ల గుర్తు చేశారు.