ఏపీలో అది మళ్లీ రిపీటవుతుందా?

May 29, 2020

వైఎస్ జగన్ గురించి బీజేపీ కన్న కలలు కొన్ని నిజం అవుతుంటే... ఇంకొన్ని దారుణమైన అనుభవాలు మిగులుస్తున్నాయి. ఎంతయినా పలు సీబీఐ కేసుల్లో ఉన్నవాడు కదా ఇరికించే అవకాశం ఎప్పటికైనా ఉంటుంది, అతనితో సయోధ్య చేస్తే మన పార్టీ ఎదగొచ్చు అని బీజేపీ చేసిన ఆలోచన కొంతవరకే నెరవేరింది. బీజేపీ కూడా ఊహించని విజయాన్ని జగన్ అందుకున్నారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... బీజేపీ చేతిలో జగన్ ఉన్నారు గాని వైసీపీ పార్టీ మాత్రం బీజేపీ చేతిలో లేదనే విషయం తేటతెల్లమైంది. జగన్ వినయం వల్ల జగన్ కు అంతో ఇంతో లాభం చేకూరుతోంది గాని... బీజేపీకి ఏం ప్రయోజనం కలగని పరిస్థితి. మరోవైపు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్ర వ్యవహారాలను ఇబ్బంది పెట్టేలా ఉండటం బీజేపీకి అస్సలు నచ్చడం లేదు. ఇలాగే వదిలేస్తే జగన్ వల్ల బాగా డ్యామేజీ అయిపోతామని భావించిన బీజేపీ లోపాయకారీ మద్దతును ఉపసంహరించుకున్నట్టు తాజా పరిణామాలతో అవగతం అవుతోంది.
ఎపుడైతే పీపీఏల విషయంలో కేంద్రం సలహాను లెక్కచేయలేదో అప్పటి నుంచి మాటిమాటికి స్థానిక బీజేపీ నేతలు జగన్ పాలనపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీని ఆడుకుంటున్నారు. ఈ ఒత్తిడికి తట్టుకోలేక ఇటీవలే విజయసాయిరెడ్డి ఒక అబద్ధం చెప్పారు. అదేంటంటే... జగన్ అన్నీ మోడీకి, అమిత్ షాకి చెప్పే చేస్తున్నారు అని అన్నారు. వెంటనే మరుసటి రోజే బీజేపీ కేంద్ర మంత్రి సాయిరెడ్డికి చీవాట్లు పెట్టారు. మాకు ఎవరూ చెప్పడం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. సమాఖ్య వ్యవస్థలో ఎవరికి వారు పనిచేసుకుంటూ పోవాలని హెచ్చరించారు.
ఇంకోవైపు లోకల్ బీజేపీ నాయకులను ఏమీ విమర్శించలేక వైసీపీ నేతలు చేతులు పిసుక్కుంటున్నారు. చంద్రబాబు మీద ఇంతెత్తున ఎగిరిపడే సాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ ఎంత తిట్టిన ఏమీ అనలేకపోతున్నారు. బాస్ తనను తిడితే తాను పోయి పెళ్లాన్ని తిట్టినట్టు... బీజేపీ వాళ్లు తిట్టిన ఫ్ట్రస్ట్రేషన్ ని టీడీపీ మీద చూపిస్తున్నారు సాయిరెడ్డి. అసలు బీజేపీ ఏ అంశాన్న వదలకుండా జగన్ పై దాడిచేస్తోంది. ఇప్పటివరకు బీజేపీ నుంచి జగన్ కు విమర్శలు తప్ప అభినందనలు లేవు.
ఇదిలా ఉంటే... కొంతకాలం మౌనంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇసుప పాలసీతో మొదలుపెట్టి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా రాజధాని అమరావతి మార్పు విషయంలో పవన్, బీజేపీ రెండూ తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమరావతికి పునాది వేసింది టీడీపీయే కాబట్టి వారు కూడా దీనిని వ్యతిరేకించరు. ఇలా ఈ విషయంతో పాటు అనేక విషయాలపై జనసేన వెర్షన్ వైసీపీకి వ్యతిరేకంగానే ఉంది.
ఇక టీడీపీ అంశాల వారీగా జగన్ తప్పులను ఏకి పారేస్తూ... ఓ రేంజిలో సాక్ష్యాధారాలతో సహా ఎండగడుతోంది. లోకేష్, చంద్రబాబులు చెరోవైపు జగన్ కి, వైసీపీకి ఊపిరాడకుండా చేస్తున్నారు. పాలన అనుభవం లేక వారి దూకుడుకు జగన్ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పోలవరం, పీపీఏలు, అమరావతి, రైతు రుణమాఫీ... వంటి అనేక అంశాల్లో జగన్ ని ఇరికించింది టీడీపీ.

ఓవరాల్ గా... ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. ఏ అంశంలోనూ ఇవి జగన్ తో, వైసీపీతో ఏకీభవించడం లేదు. వైసీపీ బలపడం కూడా తమకు ముప్పే అని బీజేపీ గ్రహిస్తోంది. అలా అని టీడీపీకి వెంటనే చేయి అందించే పరిస్థితిలో బీజేపీ లేదు. బీజేపీని అడిగే పరిస్థితిలో టీడీపీ లేదు. కాకపోతే ఇద్దరికి మధ్య సంధిమార్గంలో ఉంది పవన్ జనసేన. ఇప్పటికిపుడు ఏమీ జరగకపోయినా... మొదటతో ఉద్యమాలతో వీరంతా ఏకమై ఆ తర్వాత కూటమి కడతారని అపుడే అంచనాలు వినిపిస్తున్నాయి. బహుశా ఇది రెండు మూడేళ్ల తర్వాత జరగొచ్చు గాని జరగడానికి అవకాశం మాత్రం పుష్కలంగా ఉందంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా.