పరీక్షల రద్దు.. వైసీపీ ఫ్యాన్స్‌ను ఆడుకుంటున్న సైనిక్స్

August 06, 2020

మొత్తానికి మరో లాంఛనం పూర్తయింది. తెలంగాణలో మాదిరే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పదో తరగతి పరీక్షలు రద్దయిపోయాయి. తెలంగాణలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నపుడే ఆంధ్రాలో అదే జరుగుతుందని నిపుణులు అంచనా వేశారు.

తెలంగాణలో నిర్ణయం జరిగిన వెంటనే తమిళనాడులో సైతం పది పరీక్షలు రద్దు చేశారు. ఇక ఆంధ్రాల్లో నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అన్నారు. ఐతే వెంటనే నిర్ణయం ప్రకటిస్తే ప్రతి విషయంలో తెలంగాణను కాపీ కొడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తాయనుకున్నారో లేక నిజంగానే పరీక్షలు నిర్వహించి తీరాలని పట్టుదలతో ఉన్నారో తెలియదు కానీ.. ఎట్టకేలకు ఇప్పుడు నిర్ణయం ప్రకటించేశారు. దీంతో పరీక్షల విషయంలో ఉత్కంఠతో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం వచ్చినట్లయింది.

ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేసిన నాయకుల్లో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఆయన ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. వరుసబెట్టి ట్వీట్లు కూడా వేశారు. ఐతే అప్పుడు వైసీపీ అభిమానులు, మద్దతుదారులు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు.

పవన్ ఇంటర్మీడియట్ కూడా పాస్ కాలేదని.. అందుకే ఆయనకు పరీక్షలంటే గిట్టదని.. తనలాగే అందరూ తయారవ్వాలనే ఉద్దేశంతో పరీక్షల రద్దు కోసం డిమాండ్ చేశాడని ఆయన మీద ట్రోల్స్ వేశారు. ఐతే ఇప్పుడు జనసైనికుల వంతు వచ్చింది.

ఇంతకుముందు పరీక్షల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు జరపాలన్న జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్లు వేసి ఇప్పుడు యుటర్న్ తీసుకున్న వైకాపా అభిమనుల్ని జనసైనికులు ఆడేసుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు వైకాపా ఫ్యాన్స్ ట్వీట్లు బయటికి తీసి.. వాళ్లను రివర్స్‌లో ట్రోల్ చేస్తున్నారు.

పవన్ మీద అప్పుడు అలా కామెంట్లు చేసిన వైకాపా ఫ్యాన్స్ ఇప్పుడేమంటారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయంలో ఎలా స్పందించాలో తెలియక వైకాపా మద్దతుదారులు తలలు పట్టుకుంటున్నారు.