విలేక‌రికి 1292 కోట్ల ప‌రిహారం...కోర్టు సంచ‌ల‌న తీర్పు

February 27, 2020

ఒక‌టి కాదు రెండు కాదు....ఏకంగా రూ.1292 కోట్లు నష్టపరిహారం..ఎవ‌రికో తెలుసా?  ఓ సాధార‌ణ విలేక‌రికి!!. ఔనా? ఆయ‌న‌కు ఎందుకు అలా ఇవ్వాల్సి వ‌చ్చిందంటారా?   విష‌యం తెలిస్తే..ఆశ్చ‌ర్య‌పోతారు. 544 రోజులపాటు నిర్బంధంతో ఉండ‌టమే కాదు..తీవ్ర‌మైన‌ చిత్రహింసలను ఎదుర్కున్నందుకు. ఇంత‌కీ ఆయ‌న ఎక్క‌డ ఇలా న‌ర‌కం అనుభ‌వించాడో తెలుసా ఇరాన్ జైలులో. అందుకే...ఆ అమెరికా విలేకరికి 18 కోట్ల డాలర్ల (రూ.1292 కోట్లు) నష్టపరిహారం ఇవ్వాలని అమెరికా కోర్టు ఆదేశించింది.

సంచ‌ల‌నం సృష్టించ‌డమే కాకుండా రాజ‌కీయంగా దౌత్య‌ప‌రంగా కీల‌క‌మైన ఈ ప‌రిణామం వివ‌రాలివి. అమెరికాకు చెందిన‌ వాషింగ్టన్ పోస్ట్‌ పత్రిక విలేకరిగా జాసన్‌ రెజాయిన్‌ అనే విలేకరి ఇరాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆయ‌న గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇరాన్‌ ప్రభుత్వం 2014లో అరెస్టు చేసింది. అతడి భార్యను కూడా నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేసింది. జాసన్‌ను మాత్రం 544 రోజులపాటు టెహ్రాన్‌లోని ఒక జైలులో నిర్బంధించి...ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి మేరకు విడుదల చేసింది. అమెరికాకు చేరుకున్న జాసన్‌.. తనకు ఇరాన్‌ నుంచి పరిహారం ఇప్పించాలంటూ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ జడ్జి.. జాసన్‌కు 18 కోట్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, దీనిపై ఇరాన్‌ స్పందించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఇరాన్‌తో 2015లో చేసుకున్న అణు ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది రద్దు చేసిన అనంతరం ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అనంత‌రం కొద్దికాలానికి  సౌదీ అరేబియాలోని భారీ చమురు క్షేత్రాలపై దాడి జరిగిన అనంతరం అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ దాడి వెనుక ఇరాన్ ఉంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వ‌యంగా ఆరోపించ‌గా...దానికి ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇతర మార్గాల ద్వారా తమను లొంగదీసుకోవడం చేతకాకపోవడంతో అమెరికా తమపై గరిష్ఠంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. తాజాగా ఇంత భారీ మొత్తంలో జ‌రిమానా చెల్లించ‌డం సంచ‌ల‌నంగా మారింది.