జయసుధ వైసీపీలో చేరడానికి ఆ సినీ నటుడే కారణమట...!

July 03, 2020

కొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదలతో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఇందుకోసం ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవడమేమో గానీ, అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా చాలా మంది లీడర్లను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా కొందరు ముఖ్య నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. ఒకవైపు కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్.. మరోవైపు సినీ గ్లామర్‌ను పొలిటికల్‌గా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందుకే ఎందరో సినీ ప్రముఖులను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. పోసాని కృష్ణమురళి, పృథ్వీ రాజ్, కృష్ణుడు, ఫిష్ వెంకట్, భాను చందర్ సహా మరికొందరు సినీ నటులను ఫ్యాన్ కిందకు రప్పించుకోగలిగారు. తాజాగా సహజ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే జయసుధను కూడా తమ పార్టీలో చేర్చుకున్నారు వైసీపీ అధినేత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ.. ఆ తర్వాత టీడీపీలో చేరి, ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు.

2016లో తెలుగుదేశం పార్టీలో చేరిన జయసుధ.. మొదటి నుంచీ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమె హఠాత్తుగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. గురువారం లోటస్‌ పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. వైఎస్‌ జగన్‌ జయసుధ, ఆమె కుమారుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా.. ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. వైఎస్సార్ కోరిక మేరకే రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడు ఆయన ఏం చెబితే అదే చేశాను. ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటా. వైఎస్సార్ సీపీలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది’’ అని చెప్పుకొచ్చారు. జయసుధ ఉన్నట్లుండి ఇలా వైసీపీలో చేరడానికి కారణం ఏమై ఉంటుందా అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, ఆమె చేరిక వెనుక మాజీ ఎంపీ అయిన సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు ఉన్నారని తెలుస్తోంది. వైస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన జయసుధను వైసీపీలో చేరమని సలహా ఇచ్చారని, అందుకే ఆమె ఆ పార్టీలో చేరారని సమాచారం.