జయప్రద శాపం పెట్టింది...ఎవరికో తెలుసా?

June 03, 2020

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు తిరుగులేని వారు.. తర్వాతి కాలంలో ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎవరి హవా అయినా కొంతకాలమే తప్పించి శాశ్వితం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారంతా ప్రశాంతంగా బతికేస్తుంటారు. అందుకు భిన్నంగా ఉండేవారంతా ఎగిరెగురుతారు కానీ ఎప్పుడో ఒకప్పుడు కిందకు పడతారన్నది మర్చిపోకూడదు. యూపీ ఎంపీ అజంఖాన్ పరిస్థితి ఇప్పుడు ఇదే రీతీలో ఉంది. తనకు తిరుగులేదేన్నట్లుగా వ్యవహరించే ఆయన.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండేవారు. తనకు తోచినట్లుగా వ్యవహరించే ఆయనపై ఇప్పుడు బోలెడన్ని కేసులతో సతమతమవుతున్నారు.

తాజాగా జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచార బరిలోకి దిగారు సినీ నటి.. బీజేపీ నేత జయప్రద. ఆమెకు.. ఆజంఖాన్ కు మధ్యనున్న రాజకీయ వైరం అందరికి సుపరిచితమే. అప్పట్లో వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వీరి మధ్య పొసిగేది కాదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజంఖాన్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వైనాన్ని ఆమె తీవ్రంగా ఎద్దేవా చేశారు. మహిళల కారణంగానే ఆయనపై భూకబ్జా కేసులు నమోదయ్యాయని.. ఎంతో మంది మహిళల్ని ఏడిపించిన ఆయనకు తగిన శాస్తి జరిగిందన్నారు. ఎంతోమంది మహిళల కన్నీటికి ఆజంఖాన్ కారణమని.. ఇప్పుడు వారి కన్నీళ్లు.. శాపాలతోనే ఆయన ఇప్పుడున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఒకప్పుడు తనను మంచి నటి అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇప్పుడు తనకంటే బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తనను ఓడించిన ఆజంఖాన్ పై ఆమె కసిదీరా విమర్శలు చేస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.