పోలీసులకు చెమటలు పట్టించిన జేసీ

February 26, 2020

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి సంచలన డిమాండ్ చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తోందని.. నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని.. భయపెట్టి పాలించాలని చూస్తోందని ఆరోపించిన ఆయన ఇవన్నీ ప్రజాస్వామ్య విరుద్ధమైన పనులు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు.
కాగా పోలీసుల పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ఈ రోజు పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. ముందస్తు బెయిలు తీసుకున్న తరువాత ఆయన స్టేషనుకు వచ్చారు. అయితే, పోలీసులు తెలివిగా ఆయన్ను సుమారు 8 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు.
దీంతో జేసీ పోలీసులపై మండిపడ్డారు. తానేమైనా దేశద్రోహం చేశానా అని ప్రశ్నించారు. పోలీసుల యాక్షన్‌కు రియాక్షన్ తప్పదంటూమరోసారి పోలీసులకు హెచ్చరికలు చేశారు.
మరోవైపు జేసీ ఎంతకూ స్టేషన్ నుంచి బయటకు రాకపోవడంతో ఆయన అభిమాని ఒకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆయన అభిమానులు, అనుచరులు తాడిపత్రి నుంచి పెద్ద సంక్యలో చేరుకోవడంతో పోలీసు స్టేషన్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆయనకు బెయిలు ఇచ్చి విడిచిపెట్టారు. మొత్తానికి జేసీ పోలీసు స్టేషన్లో ఏడెనిమిది గంటలు ఉన్నప్పటికీ పోలీసులకు మాత్రం చెమటలు పట్టించారు.