జేసీ అరెస్ట్ సీన్... సినిమాను తలపించిందిగా!

February 23, 2020

రాజకీయాల్లో ఉన్నప్పుడు.. రాజకీయ నేతలుగా వెలిగిపోయే వేళ.. నిరసనలు.. ధర్నాలు.. అరెస్టులు లాంటివి చాలా రోటీన్. కానీ.. అలాంటి వాటికి దూరంగా ఉంటూనే సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు చేసే నేతలు కొందరు ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. విషయం ఏదైనా.. ఉన్నది ఉన్నట్లు అన్న చందంగా కుండ బద్ధలు కొట్టేస్తుంటారు. అలాంటి జేసీని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జేసీని పోలీసులు అదుపులోకి తీసుకోవటమా? అన్న కంగారు అక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన్ను అరెస్ట్ చేసే వేళ.. పోలీసులు ఎంత ఒద్దికగా.. పద్దతిగా చేశారన్నది ఆ సందర్భంగా తీసిన వీడియోను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఇంతకూ అరెస్ట్ చేసే వరకూ జేసీ ఎందుకు తెచ్చుకున్నారంటారా? దానికో లెక్క ఉంది.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న జేసీని.. పలువురు టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒక స్థలానికి సంబంధించిన వివాదం జేసీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నడుస్తోంది. జగన్ పార్టీ నేత తన స్థలంలో బండలు పాతారు. దీన్ని అక్రమించేందుకు టీడీపీ నేతలు స్పందించారు. దీంతో.. తన వారికి మద్దతుగా జేసీ రంగంలోకి దిగారు.
ఇదిలా ఉంటే.. జేసీ అండ్ కోను అనుమతిస్తే.. వివాదం మరింత పెరిగి పెద్దది కావటమే కాదు.. అదో పంచాయితీగా మారుతుందన్న ఉద్దేశంతో గ్రామంలోకి వెళ్లకుండా ఆపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై అక్కడి స్థానిక పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల ప్రజలు మధ్య గొడవ మరింత పెరగకుండా ఉండటానికి.. ఇష్యూ కులాల మధ్య చిచ్చు రేగకుండా ఉండటానికి వీలుగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
వాహనంలో వెళుతున్న జేసీని పోలీసులు ఆపారు. ఎప్పటిలానే తనదైన శైలిలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. దీనికి పోలీసులు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ.. ఆయన్ను అరెస్ట్ చేసిన వైనం చూస్తే.. జేసీని మాత్రమే ఇలా అరెస్ట్ చేస్తారనిపించక మానదు.జేసీకి ముందుస్తుగా జాగ్రత్తలు చెబుతూ.. ఆయన నొచ్చుకోకుండా ఉండటమే తమ జీవిత ధ్యేయమన్నట్లుగా వ్యవహరించటం.. అందుకు తగ్గ మాటలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి. నేతలకు గౌరవం ఇవ్వటం తప్పు కాదు కానీ.. ఆ పేరుతోఅవసరానికి మించిన వినయాన్ని ప్రదర్శించటం కూడా పోలీస్ శాఖకు ఉండే మర్యాదను తగ్గిస్తుందన్న విషయాన్ని పోలీసులు గమనిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.