జగన్ తో రెడ్లకు న్యాయం, బాబుతో కమ్మలకు అన్యాయం

February 23, 2020

ఎవరిపైన ఎలాంటి విమర్శలు అయినా చేయడానికి వెనుకాడని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో చివరగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచి మొన్నటి ఎన్నికల్లో తన వారసత్వాన్ని కొడుకులకు ఇచ్చేసి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు జేసీ. అయితే ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు గాని వ్యవహారాలకు ఏం దూరం జరగలేదు. తాజాగా మీడియాతో మాట్లాడిన జేసీ వద్ద ఎవరో వర్మ సినిమా గురించి ప్రస్తావిస్తే... దాని గురించి నాకు తెలియదని... అయితే, జగన్ పాలనకు ’’రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం‘‘ అని పేరు పెడితే బాగుంటుందన్నారు. పనిలోపనిగా రెడ్లకు ఎక్కువ పదవులు ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా సంతోషంగా ఉన్నట్లు జేసీ కామెంట్ చేశారు. జగన్ హయాంలో రెడ్లకు న్యాయం జరిగిందని, కానీ బాబు హయాంలో కమ్మలకు అన్యాయం జరిగిందని కొత్త వాదన వినిపించారు జేసీ రెడ్డి. 

జగన్ పాలన తాత రాజారెడ్డి పాలనలా ఉందన్నారు. కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. అయితే, జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ధైర్యంగా వాటిని అమలుచేస్తాడని, మొహమాటాలేమీ ఉండవన్నారు. చంద్రబాబు ఏమనుకున్నా పర్లేదని... కొన్ని విషయాల్లో జగన్ ను అభినందిస్తానని అన్నారు.