జగన్ పై జేసీ సెటైర్ ఓ రేంజ్ లో పేలింది

August 07, 2020

ఏపీకి జగన్ వంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడు... ఈ మాట అన్నది వైసీపీ నేత కాదు, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి. అవును... ఏడాది పాలనకు జగన్ కి 100 కి 110 మార్కులు వేస్తాను అని అన్నారు. పొరపాటున నిజం అనుకునేరు... ఇది జేసీ వేసిన వ్యంగాస్త్రం. జగన్ పాలనను కొంతకాలం క్రితం మెచ్చుకున్న జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల వ్యవహరిస్తున్న తీరుతో విసుగుచెందారు. పల్లెల్లో జగన్ పట్ల నాడి మారడంతో జేసీ తన అభిప్రాయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

హైకోర్టు నిమ్మగడ్డ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత అయినా జగన్ తన పద్ధతి మార్చుకోవాలని అన్నారు. జగన్ పట్టుదలకు నెగటివ్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉందనడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసే ఉదాహరణ అన్నారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనడం జగన్ మానకపోతే త్వరలో అతను ఊహించనిది జరుగుతుందని హెచ్చరించారు జేసీ. 

రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటివి ఒకటి కాదు, వంద తీర్పులు వస్తాయి. రాజ్యాంగం మీరి ఒక్క ఇంచు పక్కకు జరిగినా న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు. ప్రజలు కూడా ఊరుకోరు. ఇక హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వాళ్లు వెళ్లాలనుకోవచ్చు. కానీ ఎక్కడకు వెళ్లినా... రాజ్యాంగం విరుద్ధంగా తీర్పులు వచ్చే అవకాశం ఉండదు అని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. 

ప్రజలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులు అయ్యేరోజులు పోయాయి. అందుకే 150 సంక్షేమ పథకాలు పెట్టిన బాబు ఓడిపోయాడు. చరిత్ర లో తనకు ఒక పేజీ ఉండాలని జగన్ కోరుకుంటున్నాడు. కానీ అది ఎలాంటి పేజీయనే దానిలో ఆయనకు కన్ఫ్యూజన్ ఉంది. జగన్ శ్రీరాముడో, రావణుడో ప్రజలు తేలుస్తారు అంటూ వ్యాఖ్యానించారు.