జగన్ కేసులపై జేడీ లేటెస్ట్ కామెంట్స్ విన్నారా?

August 13, 2020

సీబీఐ జాయింట్ డైరెక్టర్ పోస్టు అంటే అది కీలకమైనదే. కానీ సామాన్యులకు పరిచయం ఉండదు. ఆ పోస్టులో ఎవరో వస్తుంటారు, పోతుంటారు. కానీ పరిచయం ఉండదు. ఒక్క లక్ష్మినారాయణ మాత్రమే ఆ పోస్టు ద్వారా తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయం అయ్యారు. సెలబ్రిటీ హోదా వచ్చేసింది ఆయనకు. దీనికి కారణం... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడు అయిన జగన్ కేసులను డీల్ చేయడంతో పాటు ఆయనను 16 నెలలు జైల్లో పెట్టడం ద్వారా అతను దేశమంతటికీ పరిచయం అయ్యారు. ఆ తర్వాత వేరే పదవిలోకి మారాక మోటివేషనల్ స్పీకర్ గా కూడా పనిచేశారు. అనేక ప్రసంగాలు ఇచ్చారు. కొంత కాలానికి రాజకీయాలపై ఆసక్తితో వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు.

రాజకీయాల్లో ఏపీ అంతటా తిరిగి, రైతులతో ప్రత్యేక సమావేశాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేశారు. సొంత పార్టీ వైపు అడుగులు వేశారు. డబ్బు లేనిదే రాజకీయ పార్టీ పెట్టినా ఉపయోగం లేదని అర్థమయ్యాక... ఊగిసలాట అనంతరం జనసేనలో చేరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి త్రిముఖ పోటీలో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండి... సడెన్ గా రాజీనామా చేశారు. అదేంటి అంటే... పవన్ సినిమాలు చేయడం తనకిష్టం లేదని విచిత్రమైన కారణం చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంటనే నిర్ణయం తీసుకోలేదని ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తిరిగాను అన్నారు. వారి సమస్యలు తీర్చాలంటే రాజ్యాధికారం తప్పనిసరి అని అర్థమైందన్నారు. జనసేనలో సమష్టిగా పనిచేయడానికి వచ్చానని కానీ అక్కడ ఫుల్ టైం రాజకీయాలు చేసే పరిస్థితి లేదని మరోసారి వ్యాఖ్యానించారు. 

ఇక వైసీపీ అధినేత జగన్ కేసుల గురించి అడగ్గా... అప్పుడు డ్యూటీలో భాగంగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. అక్కడి నుంచి రిలీవ్ అయ్యాక నాకు వాటితో ఇక సంబంధం లేదు. ఇపుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందరిలాగే వార్తల్లో చూసి తెలుసుకోవడం తప్ప అదనపు సమాచారం తనకేమీ రాదన్నారు. 

వైఎస్సార్‌సీపీలో చేరతారా అన్న ప్రశ్నకు చేరను అనే స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు జేడీ. ప్రజల్ని, సమాజాన్ని, దేశ ఆలోచనా విధానాన్ని మార్చే పార్టీ కనిపిస్తే...  ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటాను అన్నారు. రాజకీయాల్లో ఎవరి అజెండా వాళ్లకు ఉంటుందని.. ప్రజాస్వామ్యంలో ఇదంతా భాగమన్నారు. రాజకీయ పార్టీలు వాళ్ల ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళతారని.. ఆ పార్టీ అలా ఉంది.. ఈ పార్టీ ఇలా ఉందని ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చూస్తుంటే... జేడీ జగన్ పార్టీపై చాాలా సాఫ్ట్ కార్నర్ తో ఉన్నాడు. రెగ్యులర్ గా బీజేపీని పొగిడే జేడీ... వారితో సత్సంబంధాలు పెట్టుకున్న జగన్ తో సామరస్యంగా ఉందాం అనుకున్నారేమో? !