మాజీ జేడీ సంచలన నిర్ణయం

May 26, 2020

ఉద్యోగిగా ఉన్నప్పుడు సంచలన కేసులతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయిన ఆయన.. తన బాధ్యతల నుంచి తప్పుకున్నాక కూడా కొంత కాలం హాట్ టాపిక్‌ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆయన గురించి పెద్ద చర్చే జరిగింది. ఈ మధ్య పూర్తిగా సైలెంట్ అయిపోయినా.. త్వరలోనే ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నానంటూ మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయనెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసులతో వెలుగులోకొచ్చి, అనతి కాలంలోనే నిజాయితీ గల ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. ఉమ్మడి ఏపీకి ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు, సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు, ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులతో లక్ష్మీనారాయణ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రేగిపోయింది. దీని తర్వాత ఆయన మహారాష్ట్రకు బదిలీ అయి వెళ్లిపోయారు. అయితే, ఊహించని విధంగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానంటూ చెబుతూ వస్తున్నారు.

 

వాస్తవానికి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీని పెట్టబోతున్నారని కొద్దిరోజుల క్రితం బాగా ప్రచారం జరిగింది. అంతేకాదు, పార్టీ పేరు ఇదే అంటూ పలు పేర్లు బయటికి రావడం.. ఆ తర్వాత లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడంలేదు.. లోక్‌సత్తా పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మాత్రం ఇవేమీ చేయకుండా మౌనంగానే ఉండిపోయారు. తాజాగా లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన పార్టీని స్థాపించకూడదని భావిస్తున్నారట. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడమే దీనికి కారణమని సమాచారం. ఇప్పుడు పార్టీని పెట్టినా దానిని జనంలోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదు కాబట్టి ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు, జయప్రకాశ్‌ నారాయణ కోరిక మేరకు లోక్‌సత్తా పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై ఈ నెల చివరికల్లా అధికారిక ప్రకటన చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా లక్ష్మీనారాయణ కాకినాడలో ‘‘ఇరవై ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పని చేశా. రాజకీయాల్లో ఇప్పుడే ఎల్‌కేజీలో చేరా.. నర్సరీలో తప్పటడుగుల నుంచి చిన్న అడుగులు వేశాను. పెద్ద అడుగులు వేసేటప్పుడు మీరే చూస్తారు’’ అంటూ కామెంట్లు చేయడం చర్చనీయాంశం అయింది.